తెలంగాణ చరిత్రలో మైలు రాయి…డిసెంబర్ 9

157
December9,Telangana was announced

చరిత్రలో కొన్ని రోజులకు సుస్థిరస్థానం ఉన్నది. ముఖ్యంగా డిసెంబర్ 9. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మరిచిపోలేని మైలురాయి. కేసీఆర్ దీక్షా ఫలితం…. డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేస్తూ హోమంత్రి చిదంబరం ప్రకటన. ఈ ప్రకటనతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగిందంతా దాని కొనసాగింపు మాత్రమే. ఇందులోనే చర్చలు, సంప్రదింపులు, కమిషన్ నివేదికలు, బిల్లు రూపకల్పన , అసెంబ్లీ, పార్లమెంటు చర్చ, రాష్ట్ర ఆమో దం, 2014 జూన్ 2న ఆవిర్భావం.

కేసీఆర్ దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచి తెలంగాణపై ప్రకటన వచ్చేవరకు ఆ పదకొండు రోజులు యావత్ ప్రజానీకాన్ని రోడ్లపైకి తెచ్చింది. ప్రపంచానికి తెలంగాణ చైతన్యాన్ని చూపింది. కేంద్రంలో కదలిక తెచ్చింది. నిరాశ, నిస్పృహలతో ఉన్న తెలంగాణ సమాజం సంబరాలు చేసుకునేందుకు కారణమైంది సరిగ్గా ఈరోజే.

December9,Telangana was announced

సరిగ్గా ఏడేళ్ల క్రితం ఆనాటి హోంమంత్రి చిదరంబం చేసిన ఈ ప్రకటన.. తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనని దేశానికి చాటి చెప్పింది. ఆ తర్వాత సమైక్యాంధ్ర విభజనను అడ్డుకునేందుకు ఏపీ నేతలు రాజీనామాలతో కుట్రలు మొదలు పెట్టారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన ఆనందాన్ని ఒక్కరోజు నిలవనీయలేదు. అర్ధరాత్రి నుంచే కుట్రలు మొదలయ్యాయి. రాజీమానాల పేరుతో సీమాంధ్ర నాయకులు కొత్త డ్రామాలకు తెరలేపారు. కమిటీల పేరుతో కేంద్రం కాలయాపన చేసినా.. ఉద్యమం ఎక్కడా తగ్గలేదు.

రాష్ట్ర విభజన అంశంపై జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీని నియమిస్తూ డిసెంబర్‌ 23న మలి ప్రకటన చేసింది. ఈ సమయంలో తెలంగాణ ఒక్క అడుగు వెనక్కి వేసినట్లు అనిపించినప్పటికీ… ఉద్యమం మాత్రం పది అడుగులు ముందుకు పడింది. 2010 ఫిబ్రవరి 3న జస్టిస్‌ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ 2010 డిసెంబర్‌ 30న తన నివేదికను అందించింది. తెలంగాణ ఇవ్వాలనిగానీ, ఇవ్వొద్దనిగానీ స్పష్టంగా చెప్పకుండా అనేక ఆప్షన్లతో వెలువడిన ఈ నివేదిక మరింత అనిశ్చితికి కారణమైంది.

December9,Telangana was announced

తెలంగాణలో మరోదశ ఉద్యమం, గతంలోకంటే తీవ్రంగా, బలంగా మొదలైంది. సమస్తవర్గాలు ఉద్యమ బాట పట్టాయి.రైల్ రోకో, సాగరహారం, మిలియన్ మార్చ్, వంటావార్పు ఒకటేమిటి.. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలను.. యూపీఏ భాగస్వామ్య పక్షాలను కూడా ఆలోచింపచేసేలా ఉద్యమం నడించేందుకు ఈ తెలంగాణ ప్రకటనే సాయపడింది. సీపీఎం మినహా తెలంగాణలోని పార్టీలన్నీ రాష్ట్ర విభజనకు జై కొట్టాయి. 2012 డిసెంబర్‌ 28న జరిగిన అఖిల పక్ష సమావేశంలో దాదాపు తుది నిర్ణయానికి వచ్చి… తెలంగాణను ఇవ్వడానికి కేంద్రం మొగ్గుచూపింది. అనంతరం కేబినెట్‌లో బిల్లును ఓకే చేయడం… దానిని రాష్ట్ర అసెంబ్లీకి పంపించండం జరిగింది.

విభజనను అడ్డుకోవడానికి నాటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాష్ట్రానికి వచ్చిన బిల్లును అసెంబ్లీలో తిరస్కరిస్తూ కేంద్రానికి పంపించారు. కానీ… ఏదిఏమైనా తెలంగాణ ఇచ్చి తీరాలన్న కృతనిశ్చయంతో ఉన్న యూపీఏ సర్కారు అడుగు ముందుకే వేసింది. భారీ హైడ్రామా మధ్య ఫిబ్రవరి 18న లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. ఫిబ్రవరి 20న రాజ్యసభలోనూ గట్టెక్కింది. ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో దేశంలో 29వ రాష్ట్రంగా ఈ ఏడాది జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భవించింది.

December9,Telangana was announced

అందుకే తెలంగాణ బిడ్డలంతా డిసెంబర్ 9 అనగానే.. తెలంగాణ తొలిప్రకటన అని టక్కున చెబుతారు. ఎన్నో ఆశలు , ఆశయాలు, ఆకాంక్షలతో ఏర్పాటైన తెలంగాణ.. ఉద్యమంలో దేశానికి ఆదర్శంగా నిలిచినట్లుగానే.. అబివృద్ధిలోనూ మరింత వేగంగా ముందుకు బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకుసాగుతోంది.