నల్లగొండ జిల్లా హాలియాలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ‘ప్రగతి సమీక్షా సమావేశం’లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సాగర్ ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్నిచ్చి ముందుకు నడిపించినందుకు ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరోనా మహమ్మారి కారణంగా సాగర్‌కు రావడం ఆలస్యమైందన్నారు. తనను కూడా కరోనా విడిచిపెట్టలేదు. ఎన్నికలు అయిపోగానే ఇక్కడకు రాలేకపోయాను. సమస్యలు చాలా పెండింగ్‌లో ఉన్నాయి అని సీఎం తెలిపారు.
నెల రోజుల్లో హక్కు పత్రాలు:
నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్‌తో పాటు ఇరిగేషన్ భూముల్లో ఉన్నవారిని క్రమబద్దీకరిస్తాం. చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఆ ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ, హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదేశిస్తున్నాం. ఈ పని నెల రోజుల్లో పూర్తవుతుందన్నారు.
నందికొండ, హాలియా మున్సిపాలిటీలకు రూ. 15 కోట్ల చొప్పున నిధులు:
నందికొండ, హాలియా మున్సిపాలిటీకి నిధులు కావాలని అడిగారు. హాలియాకు రూ. 15 కోట్లు, నందికొండ మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఈ మున్సిపాలిటీల అభివృద్ధికి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలన్నారు.
ఇక సాగర్ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ మంజూరు:
చేస్తున్నాం. సిబ్బంది, భవనం ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మిని స్టేడియం కూడా మంజూరు చేస్తాం. ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, కల్వర్టల నిర్మాణానికి రూ. 120 కోట్లను మంజూరు చేస్తున్నాను. మొత్తంగా రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నాను అని తెలిపారు. రెడ్డి కల్యాణ మండపం కోసం గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో కొన్ని ఫండ్స్ మంజూరు చేశారు. ఆ కల్యాణ మండపానికి స్థలం కేటాయిస్తాం. షాదీఖానా కోసం కూడా స్థలం కేటాయిస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
మొత్తం 15 లిఫ్ట్‌లు:
గుర్రం పోడు ప్రాంతంలో ఒక లిఫ్ట్ పెట్టినట్లు అయితే ఐదారు గ్రామాలకు కలిపి 10 వేల ఎకరాలకు నీరు వస్తుందని చెప్పారు. త్వరలోనే గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇస్తాం. దీన్ని కూడా నెల్లికల్ లిఫ్ట్‌తో పాటు మంజూరు చేస్తామన్నారు. దేవరకొండలో ఐదు లిఫ్ట్‌లు మంజూరు చేశాం, మిర్యాలగూడలో ఐదు లిఫ్ట్‌లు, నకిరేకల్‌లో అయిటిపాముల వద్ద ఒక లిఫ్ట్‌తో పాటు ఈ జిల్లాకు మొత్తం 15 లిఫ్ట్‌లు మంజూరు చేయడం జరిగింది. లిఫ్ట్‌లన్నింటినీ రాబోయే ఒకటిన్నర సంవత్సరాల్లో పూర్తి చేసి జిల్లా ప్రజలకు అందిస్తామన్నారు.
ప్రైమరీ హెల్త్ సెంటర్లను అప్‌గ్రేడ్ చేస్తాం:
రాష్ట్రంలో హాస్పిటల్స్ ఆశించిన స్థాయిలో లేవు అని సీఎం తెలిపారు. ఆరోగ్య శాఖ పనితీరును మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న 18 వేల బెడ్స్‌ను ఆక్సిజన్ సరఫరా చేసుకునే బెడ్స్‌గా మార్చుకున్నాం. ఏడు కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో 33 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి కాలేజీలో 500 బెడ్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. సూర్యాపేట, నల్లగొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నాం. సాగర్‌లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లను అప్‌గ్రేడ్ చేస్తామని సీఎం ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం అవలంభించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావొచ్చు. ఆంధ్రా వాళ్లు చేస్తున్న దాదాగిరీ కావొచ్చు. కృష్ణా నదిపై ఏ విధంగా అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో మనకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లను తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే జరుగుతోంది. అది పూర్తయితే నాగార్జున సాగర్ ఆయకట్టు చాలా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. పెద్దదేవులపల్లి – పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ రాష్ట్రం అనేక విజయాలు సాధించింది. కానీ దళిత జాతి మాత్రం వెనుకబడి ఉంది. వందకు వంద శాతం, ఆరునూరైనా సరే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుందన్నారు. ప్రజల ఆదరణ ఉన్నంత వరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తాం. దళిత బంధుపై విపక్షాలు ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో 16 నుంచి 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. 12 లక్షల దళిత కుటుంబాలు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. బ్యాంకుతో సంబంధం లేకుండా ఈ నిధులు ఇస్తామన్నారు.
దళిత సోదరుల అభివృద్ధిని కాంక్షించి ఈ పథకానికి రూపకల్పన చేశామన్నారు. వచ్చే ఏడాది నుంచి పెద్దమొత్తంలో డబ్బులు మంజూరు చేసి అమలు చేస్తామన్నారు. రూ. 1200 కోట్లతో దళిత బంధును అమలు చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు వచ్చే విధంగా అమలు చేస్తామన్నారు. ఈ పథకం అమలైతే తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవు అని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. వందకు వంద శాతం, ఆరునూరైనా సరే ఈ పథకాన్ని అమలు చేస్తాం. భారత దళిత జాతికే తెలంగాణ దళిత జాతి ఆదర్శంగా తయారవుతుంది అని సీఎం కేసీఆర్ అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో.. శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడు. 2 ఏండ్లలో కరెంట్ వ్యవస్థను మంచిగా చేసి.. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పితే జానారెడ్డి ఎగతాళి చేసిండు. రెండేండ్లు కాదు 20 ఏండ్లు అయినా పూర్తి చేయలేరు అని జానారెడ్డి మాట్లాడిండు.ఒక వేళ రెండేండ్లలో పూర్తి చేస్తే తాను గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తానని చెప్పిండు కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. కలలో కూడా ఊహించనటువంటి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ జిల్లాలో ఏర్పాటు అవుతుందన్నారు. 4 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అతి పెద్ద పవర్ ప్లాంట్ ఏర్పాటవుతుందన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలకు ఇది గర్వకారణం అని సీఎం కేసీఆర్ తెలిపారు.