రాష్ట్రంలో కోతుల బెడద నివారణపై సమావేశం

57
cs somesh

రాష్ట్రంలో కోతులతో తలెత్తుతున్న సమస్యలు, అడవి పందుల బెడద నివారణకై చేపట్టాల్సిన చర్యలపై BRKR భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం నేడు జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన అటవీ, వ్యవసాయ, మున్సిపల్, జీహెచ్ఎంసీ, వెటర్నరీ విశ్వ విద్యాలయం ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కోతుల బెడద అధికంగా ఉండి రైతులు, సామాన్య ప్రజానీకం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో కోతుల బెడద నివారణకై చేపట్టాల్సిన చర్యలు సూచించాల్సిందిగా సి.ఎస్ సోమేశ్ కుమార్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో నేడు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో కోతుల బెడద నివారణకై తీసుకున్న చర్యలపై చర్చించారు.

తెలంగాణలో కోతుల బెడద నివారణకై కోతులకు సంతాన నిరోధక ఆపరేషన్ల నిర్వహణ, కోతుల పునరావాస కేంద్రాల ఏర్పాటు, రాష్ట్రంలో మరిన్నీ ఆపరేషన్ నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, ఆపరేషన్ల నిర్వహణకు తగిన సౌకర్యాల కల్పన తదితర అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు

*కోతుల బెడద నివారణపై చేపట్టాల్సిన చర్యలపై సూచనకై అటవీ, వెటర్నరీ, వ్యవసాయ శాఖల నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు.

  • ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ ప్రాక్తీస్ లపై అధ్యయనం చేసి తగు ప్రతిపాదనలు వారంరోజుల్లోగా సమర్పిoచాలి.

*కోతుల సంఖ్య తగ్గించడం, నియంత్రించేందుకై మరిన్ని సంతాన నిరోధక ఆపరేషన్ థియేటర్ ల ఏర్పాటు.

*తమ పంటలను కోతుల నుండి కాపాడటానికి పలు సాంప్రదాయక విధానాలపై రైతులు, పౌరులను చైతన్య పరచాలనే నిర్ణయం.

ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ ఆర్. శోభ, వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. ప్రవీణ్ రావు, వెటర్నరీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. రవీందర్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ డా. సత్యనారాయణ లతోపాటు పలువురు ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.