కాషాయపార్టీలోకి కాంగ్రెస్ నేత…!

86
congress
- Advertisement -

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి మోదీ, అమిత్‌షాలు కంకణం కట్టుకున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చేందుకు బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారు. ఇందు కోసం గత ఏడాది కాంగ్రెస్ సారథ్యాన్ని గాంధీ కుటుంబం నుంచి తప్పించి, మరొక సమర్థుడికి అప్పగించాలని జీ – 23 గ్రూపు పేరుతో తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ సీనియర్ల కూటమికి నాయకత్వం వహించిన గులాంనబీ ఆజాద్‌ను పావుగా వాడుకుంటోంది. గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా రాజ్యసభలో ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. అంతే కాదు ఏకంగా పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి ఆయన్ని బుట్టలో పడేసారు. కాగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఎదుర్కోబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అది రాహుల్ గాంధీ , సోనియాగాంధీల వైఫల్యంగా చిత్రీకరించి గులాం నబీ ఆజాద్ తిరుగుబాటు చేయడం ఖాయమని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

గులాం నబీ ఆజాద్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నయా కాంగ్రెస్ పేరుతో ఇంకో పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా జమ్మూకాశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం, కాంగ్రెస్ అసమ్మతి నేత గులాం నబీ ఆజాద్ మేనల్లుడు ముబషిర్ ఆజాద్ హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరారు. జమ్మూకాశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడనై బీజేపీలో చేరినట్లు ముబషిర్ ఆజాద్ తెలిపారు. అయితే పార్టీ మారడం గురించి తన మామయ్య గులాంనబీ ఆజాద్‌తో చర్చించలేదని ఆయన తెలిపారు.

ముబషిర్, ఆయన అనుచరులను జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ పార్టీ జమ్మూకాశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా పార్టీలోకి ఆహ్వానించారు. ముబషిర్ బీజేపీలో చేరడం ద్వారా దోడా, కిష్త్వార్, రంబాన్ జిల్లాల్లోని మరింత మంది యువత బీజేపీలో చేరేందుకు ఆసక్తికనబరుస్తారని రవీందర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో మోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరులో కూరుకుపోయిందని ముబషిర్ వ్యాఖ్యానించారు మాజీ సీఎం, పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ పట్ల ఆ పార్టీ వ్యవహరించిన తీరు ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ముబషిర్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా గులాం నబీ ఆజాద్ సేవలను ప్రశంసించారని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే సోనియా, రాహుల్ గాంధీలపై తిరుగుబాటు చేసిన అసమ్మతి నేత గులాంనబీ ఆజాద్‌‌పై మోదీ పొగడ్తలు కురిపించడం, పద్మవిభూషణ్ అవార్డు అందించడం వంటి పరిణామాల మధ్య ఆయన మేనల్లుడు బీజేపీలో చేరడం కాంగ్రెస్ శ్రేణులకు షాక్ ఇచ్చింది. త్వరలో గులాం నబీ ఆజాద్ , కాంగ్రెస్ సీనియర్లతో కలిసి గాంధీ కుటుంబంపై తిరుగుబాటు చేయనున్నారని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రెండుగా ముక్కలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -