తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరతీసింది. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు ఆహ్వానం పలుకుతోంది. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా బీజేపీలో మరో ముగ్గురు మాజీ ఎంపీలు త్వరలోనే చేరబోతున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ నుంచి ఇద్దరు మాజీలు ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మాజీ ఎంపీ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ నుండి దాదాపు 20 మంది ముఖ్య నేతలను పార్టీలోకి చేరుచ్చుకునేందుకు బీజేపీ మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఓ వైపు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలను వరుసపెట్టి కారెక్కిస్తుంటే… మరోవైపు బీజేపీ పార్టీ మిగిలిన కాంగ్రెస్ ముఖ్యనేతలతో పాటు టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి నేతలపై దృష్టి సారించింది. ఇందుకోసం రంగంలోకి దిగిన బీజేపీ కేంద్ర నాయకత్వం అసంతృప్తులు, టికెట్ దక్కని సిట్టింగ్ ఎంపీలపై కన్నేసిన కమలం వారితో చర్చలు జరుపుతోంది. తాజా పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. ఎప్పుడు ఏ నేత పార్టీ వీడతారో… తెలియక సతమతం అవుతోంది. ఓవైపు కారు, మరోవైపు కమలం తమ పార్టీ నేతలను లాక్కుంటుంటే హస్తం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయరైంది.
అయితే టీఆర్‌ఎస్ ఈనెల 21న అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో అప్పటివరకు వేచి చూసి టీఆర్‌ఎస్‌లో టికెట్ దక్కనివారికి, గెలిచే అవకాశం ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా ఆయా స్థానాల్లో తమ సత్తా చాటాలన్న ఆలోచనలో ఉంది బీజేపీ. ఈనేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాతే వారి అభ్యర్థుల జాబితాను ప్రకటించనట్లు తెలుస్తోంది.