ఫెడరల్ ఫ్రంట్ కోసం పావులు కదుపుతున్న కేసీఆర్..

170

టీఆర్‌ఎస్‌ అధినేత,తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై మళ్లీ దృష్టి పెట్టారు. కాంగ్రెస్-బీజేపీయేతర ప్రభుత్వమే లక్ష్యంగా గత కొంతకాలంగా పావులు కదుపుతున్న కేసీఆర్ ఈ మేరకు సోమవారం నుంచి కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో పర్యటించనున్నారు.. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు కేరళ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు త్రివేండ్రంలో కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయ పరిణామాలపై, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన కేరళ సీఎంతో చర్చించనున్నారు. మరోవైపు వివిధ అంశాల్లో కేరళ-తెలంగాణ ప్రభుత్వాల పరస్పర సహకారంపై విజయన్‌తో సీఎం కేసీఆర్‌ మాట్లాడనున్నారు. అనంతరం కేరళలోని రామేశ్వరం, శ్రీరంగ దేవాలయాలను ఆయన సందర్శించనున్నారు.

CM KCR

ఇక కేరళలో వామపక్ష కూటమి సీఎం విజయన్‌తో కేసీఆర్‌ సమావేశం కానుండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇప్పటివరకు సమాఖ్య కూటమిని వివిధ ప్రాంతీయ పార్టీల సమాహారంగా పేర్కొన్నారు. ఈ కోణంలోనే ఆయా పార్టీల నేతలతో భేటీలు కూడా జరిగాయి. అయితే, కేసీఆర్‌ తొలిసారిగా వామపక్షాలవైపు మొగ్గుచూపుతున్నారు. సీపీఎం, సీపీఐ పార్టీలు సిద్ధాంతపరంగా భాజపా, కాంగ్రెస్‌లకు దూరంగా ఉంటున్నాయి. వామపక్షాల కలయికతో సమాఖ్య కూటమి మరింత బలంగా మారుతుందనే భావనలో సీఎం ఉన్నట్లు సమాచారం.

అలాగే ఈ పర్యటనలో భాగంగా కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడలతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఇటీవల రాష్ట్రానికి సాగునీటి జలాల విడుదలపై కర్ణాటక సీఎం కుమారస్వామితో కేసీఆర్‌ దౌత్యం ఫలవంతమైంది. దీనిపై ఆయనకు కృతజ్ఞతలు తెలుపనున్నారు.