గొల్ల, కురుమల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామంలో గొల్ల, కురుమల సంక్షేమ భవనాల నిర్మాణలకు మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్ధాపన చేయనున్నారు.
ఖానా పూర్ రిజర్వాయర్ పక్కన కురుమయాదవులకు కేటాయించిన పదెకరాల స్థలంలో భవనాలను నిర్మించనున్నారు. తర్వాత సీబీఐటీ హాస్టల్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పాల్గొనే బహిరంగ సభకు కుడివైపున కళాకారుల నృత్యప్రదర్శన కోసం ప్రత్యేక ప్రాంగణం, అదేవిధంగా ప్రధాన స్టేజీ నుంచి ఇరవై అడుగుల దూరం నుంచి భారీ ప్రొజెక్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభకు వివిధ జిల్లాల నుంచి వచ్చే గొల్ల, కురుమల వాహనాల పార్కింగుల కోసం సభాస్థలి వెనుకభాగంలో దాదాపు పదెకరాల స్థలాన్ని అందుబాటులో ఉంచారు.
కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్టు, శ్రీ కృష్ణ ట్రస్టు పేరు పై కురుమ, గొల్లలకు ఐదు ఎకరాలు, 5 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ శంకుస్థాపనలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కురుమ సంఘం అధ్యక్షులు యెగ్గే మల్లేశం అధ్యక్షత వహించనున్నారు.
2015లో తమ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు రాగా, ప్రత్యేక భవన నిర్మా ణం, సంక్షేమ ఫలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ నేపథ్యంలో ఇవాళ గొల్ల,కురుమల ప్రత్యేక భవనాలకు శంకుస్ధాపన చేయనున్నారు.