టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ హుజూరాబాద్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రం నలుమూలల నుంచి సభకు వచ్చిన దళిత సోదరసోదరీమణులందరికీ “జై భీమ్” అంటూ ప్రసంగం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇదే వేదిక నుంచి రైతుబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ రైతు బంధు కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తున్నది. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. తెలంగాణ రైతాంగంలో ధీమా పెరిగింది. కరీంనగర్ పట్టణంలో జరిగిన సభలో రైతుబీమా ప్రకటించాను. ఆ స్కీం అద్భుతంగా కొనసాగుతోంది.
తెలంగాణ చరిత్రలో మహోత్తరమైన, కొత్త చరిత్రను సృష్టించే, తరతరాల దోపిడీ నుంచి, సామాజిక వివక్ష నుంచి మన దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందటానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ జిల్లా తెలంగాణ సాధనలో తొలిసింహ గర్జన నుంచి నేటి వరకు కూడా సెంటిమెంట్‌గా బ్రహ్మాండమైన పద్ధతుల్లో తెలంగాణ ప్రజలకు విజయం చేకూరే వేదికగా ఈ జిల్లా మారింది. ఈ క్రమంలోనే ఈ జిల్లా నుంచే అద్భుతమైన ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాను. మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్‌కు పుష్పాంజలి ఘటించి శ్రీకారం చుడుతున్నాం. అని సీఎం కేసీఆర్ అన్నారు.
దళితబంధు ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. కాకూడదు కూడా. ఇది ఒక మహా ఉద్యమం. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. గతంలో నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు చాలా అనుమానాలు, అపోహాలు ఉండేవి. మీ అందరి దీవనెలతో రాష్ట్రం నలుమూలుల ఉద్యమం ఉవ్వెత్తున చెలరేగి 14, 15 సంవత్సారల కృషి తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ సగర్వంగా దీవిస్తున్నారు. అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించాం. ప్రతి రోజు ప్రతి నిత్యం మీ కండ్లముందు గ్రామాల్లో, మండలాల్లో, మీ అనుభవంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అని సీఎం కేసీఆర్ అన్నారు.