రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని చెత్తనాయకులంతా నల్గొండ జిల్లాలోనే ఉన్నారని, కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి పెద్ద శాపంలా దాపురించారని సీఎం కేసీఆర్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల చేతగాని తనంతోనే నల్గొండ జిల్లా ఇంకా ప్లోరైడ్ సమస్యతోని బాధ పడుతోందని, ఢిల్లీలోని నాయకులకు కాంగ్రెస్ నాయకులు గులాంలని, వారిని చూస్తేనే ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు లాగులు తడుస్తాయని కాంగ్రెస్ నాయకులపై వ్యంగస్త్రాలు సంధించారు సీఎం కేసీఆర్.
కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో నాడు నెహ్రూకు భయపడి ప్రాజెక్టుల విషయంలో నోరు మూసుకున్నారని, నేడు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ప్రభుత్వం రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు ప్రాజెక్టులు కడుతోంటే రాష్ట్ర కాంగ్రెస్ దద్దమ్మలు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతున్నారని దుమ్మెత్తిపోశారు సీఎం కేసీఆర్. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలలాగా నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి లావు, పొడుగు లేడని, అయినా నల్గొండ జిల్లా అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడకుండా బ్రహ్మండంగా అభివృద్ధి చేసి చూపించారని పొగడ్తల వర్షం కురిపించారు సీఎం కేసీఆర్.