శుక్రవారం సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు జనగామ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చేవి అని కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు జనగామలో అలాంటి పరిస్థితి లేదని సీఎం స్పష్టం చేశారు. జనగామ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏడు సంవత్సరాల క్రితం ఎక్కడో ఉన్నాం. ఇవాళ అభివృద్ధిలో ఎక్కడికో చేరుకున్నాం. చాలా రకాల వాదోపవాదాలు జరిగాయి. సమైక్యవాదులతో కలిసి చాలా రకాల అపోహాలు, అనుమానాలు సృష్టించారు. మొండిపట్టుదలతో, మీ దీవెనలతో ముందుకు వెళ్లి తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు తెలంగాణ అద్భుతంగా తయారైంది అని సీఎం పేర్కొన్నారు.
జనగామ మీదుగా వెళ్లినప్పుడు తాను, జయశంకర్ సార్ చాలా బాధపడేవాళ్లం. చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండేవి. సిద్దిపేట నుంచి ఈ మార్గం గుండా వరంగల్‌కు వెళ్తున్నాను. బచ్చన్నపేట మండల కేంద్రంలో మాట్లాడాలంటే ఆగాను. కేసీఆర్ మీటింగ్‌కు చాలా మంది వృద్ధులు వచ్చారు. 8 సంవత్సరాల నుంచి కరువు ఉంది. మంచినీళ్లు కూడా లేవు. నాలుగైదు కిలోమీటర్ల నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. యువకులు వలస పోయిండ్రు అని చెప్తే నేను ఏడ్సినా. కానీ ఇవాళ రాష్ట్రం సాధించుకున్నాం. పట్టుబట్టి ప్రణాళికబద్ధంగా, పూర్తి అవినీతిరహితంగా ముందుకు వెళ్తున్నాం.
దేవాదుల నీళ్లు తీసుకొచ్చే క్రమంలో రాజయ్య, ముత్తిరెడ్డి గొడవ పెట్టుకున్నారు. కానీ పట్టుబట్టి, జట్టుకట్టి అద్భుతంగా దేవాదుల పూర్తి చేసుకుని నీళ్లు తెచ్చుకున్నాం. ప్రజల అవసరాలను తీర్చడానికి నాతో యుద్ధం చేసి పనులు చేయించుకున్నారు. అందుకు అనుగుణంగా ఫలితాలు వచ్చాయి.. వస్తున్నాయి. జనగామలో ఇవాళ పంటలు అద్భుతంగా పండుతున్నాయి. జులై చివరినాటి వరకు కూడా వరి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. కరువు నుంచి బయటపడ్డాం.
జనగామలో భూముల విలువలు పెరిగాయి. ఏడేండ్ల కింద రూ. రెండు లక్షల విలువన్న ఎకర భూమి.. ఇప్పుడు రూ. రెండు, మూడు కోట్లకు చేరింది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఎకర పొలం రూ. 25 లక్షలకు తక్కువ పోతలేదు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధ్యమైంది. అధికారులు కూడా రాత్రింబవళ్లూ కష్టపడి పని చేశారు. సీఎస్, అధికారులు, ప్రజాప్రతినిధులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తిపోవద్దు. ఉద్యమ సమయంలో ఉద్యోగులకు అండగా నిలిచి.. ఇప్పుడు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. మన ఉద్యోగులు ఆర్థికంగా నిలబడుతున్నారు. వరంగల్ జిల్లాకు కానీ, తెలంగాణకు కానీ కరువు రాదు. ఆ సమస్య లేనే లేదు. కరెంట్ సమస్య ఉండనే ఉండదు. అద్భుతమైన తెలంగాణను నిర్మించుకుంటున్నాం. తెలంగాణ వచ్చింది.. బాగుపడుతుంది.. ఇంకా ఇంకా బాగుపడుతది అని సీఎం స్పష్టం చేశారు.