తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షిస్తున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనాను అదుపు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకడంతో విమానాశ్రయాల్లో వారికి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలనీ, వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా తక్షణమే ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలని సీఎం తెలిపారు.
ఈ సమీక్షలో మంత్రులు ఈటల రాజేందర్, మహముద్ అలీ, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది ప్రభుత్వం.