లాక్‌డౌన్‌ తప్ప వేరే మార్గం లేదు- సీఎం కేసీఆర్‌

206
ts cm kcr

తెలంగాణలో కరోనా క్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కరోనా సోకడం, వారికి కుటుంబ సభ్యులు దగ్గరగా మెలగడంతో.. రోజు రోజుకూ కొత్త కేసులు ఎక్కువ సంఖ్యలో బయటపడుతున్నాయి. తెలంగాణలో కోవిడ్-19 బాధితుల సంఖ్య 334కి చేరుకోవడంతో.. సీఎం కేసీఆర్ మరింత అప్రమత్తమయ్యారు. సోమవారం ప్రగతిభవన్‌లో వైద్యఆరోగ్యశాఖ, పోలీస్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు, కరోనా కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

భారత్ లో కరోనా ప్రాబల్యం పెరుగుతున్న దశలో కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అనుగుణంగా తాము నిర్ణయాలు తీసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. మన దేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే కరోనా బాధితుల సంఖ్య చాలా తక్కువ అనే చెప్పుకోవాలని, ఇప్పటివరకు ఉన్న అధికారిక లెక్కల ప్రకారం కరోనా సోకినవారి సంఖ్య 4,314 అని, మృతుల సంఖ్య 122 అని వెల్లడించారు. ఇతర దేశాలతో పోల్చితే మన దేశం పరిస్థితి కాస్త మెరుగు అని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మీడియా సైతం భారత్ ను కొనియాడుతోందని, అనేక రాష్ట్రాలు, అనేక ప్రభుత్వాలు ఉన్నా భారత్ ఒక్కతాటిపై నిలిచిందని పాశ్చాత్య మీడియా సంస్థలు కొనియాడాయని తెలిపారు.

“ఇవాళ అమెరికా వంటి దేశమే అల్లాడిపోతోంది. అమెరికా ఆర్థిక రాజధానిగా పేర్కొనే న్యూయార్క్ లో శవాల గుట్టలు పడి ఉన్నాయి. అక్కడి సంగతులు వింటుంటే భయంకరంగా అనిపిస్తోంది. అమెరికా పరిస్థితి ఎంతో హృదయవిదారకంగా ఉంది. అలాంటి పరిస్థితి మరే దేశానికీ రాకూడదని అనిపిస్తోంది. శవాలను ట్రక్కుల్లో పంపిస్తున్నారు. వాటిని ఏంచేస్తున్నారో తెలియదు. అన్ని విధాలా అత్యంత శక్తిమంతమైన దేశం కూడా ఇవాళ నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయింది. అమెరికా పరిస్థితే మనకు వస్తే కోట్లమంది చచ్చిపోయేవాళ్లు. కానీ మనం చాలావరకు భద్రంగా ఉన్నామనే చెప్పాలి” అంటూ వ్యాఖ్యానించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచిది అని సీఎం తెలిపారు. ఇండియాలో జూన్‌ 3 వరకు లాక్‌డౌన్‌ పాటించాలని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ చెప్పింది అని సీఎం గుర్తు చేశారు. మన దేశానికి లాక్‌డౌన్‌ తప్ప వేరే మార్గం లేదు అని ఆయన తేల్చిచెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా నష్టపోక తప్పదు అని అన్నారు. మన రాష్ర్టానికి రోజుకు రూ. 400 నుంచి రూ. 430 కోట్ల ఆదాయం వస్తుంది. లాక్‌డౌన్‌ మూలంగా కేవలం రూ. 6 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు సీఎం. ప్రజలను బతికించుకోవాలంటే లాక్‌డౌన్‌ తప్ప వేరే మార్గం లేదు. ఒక వేళ లాక్‌డౌన్‌ సడలిస్తే పరిస్థితి ఏంటి? అని సీఎం ప్రశ్నించారు. మళ్లీ గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వస్తే ఎవరు జవాబుదారీ అని సీఎం అడిగారు. లాక్‌డౌన్‌ సడలించడమంటే అంత ఆషామాషీ కాదు. ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనని ప్రధానికి చెప్పాను.

ఇది ప్రపంచానికి వచ్చిన పీడ. ఒక్క కుటుంబానికో, జాతికో రాలేదు. 22 దేశాలు పూర్తిగా 100 శాతం లాక్‌డౌన్‌ చేశాయి. జపాన్‌, సింగపూర్‌, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, కొలంబియా, అర్జెంటీనా, నేపాల్‌తో పాటు మరిన్ని దేశాలు మన పద్ధతిలోనే లాక్‌డౌన్‌ చేశాయి. మరో 90 దేశాలు పాక్షికంగా లాక్‌డౌన్‌ చేశారు. మన రాష్ట్రం మంచి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సమాజాన్ని బతికించుకున్నామంటే లాక్‌డౌన్‌, స్వీయ నియంత్రణ వల్లే అయిందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ వల్లనే పరిస్థితిని కంట్రోల్‌ చేశాం అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.