అర్హులైన దళితులందరికీ ‘దళిత బంధు’- సీఎం కేసీఆర్‌

130
- Advertisement -

కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా ‘దళిత బంధు పథకం’ రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని, దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.
హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళిత బంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని తెలిపారు. అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని, దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు సీఎం పిలుపునిచ్చారు. ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను నియమించిన నేపథ్యంలో సీఎంకు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు శనివారం ప్రగతిభవన్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా అభినందన కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో దళిత బంధు విజయవంతం కోసం ప్రతి దళిత బిడ్డ పట్టుబట్టి పనిచేయాలని, ప్రతి దళితవాడలో ఒక కేసీఆర్ పుట్టాలె అని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ లో విజయవంతం కావడం ద్వారా ప్రసరించే వెలుగు, తెలంగాణ సహా, దేశవ్యాప్తంగా విస్తరించాలన్నారు. తెలంగాణ దళితుల అభివృద్ధిని కూడా తెలంగాణ ఉద్యమంలా చేపట్టాలన్నారు. ‘‘రాజులు, జాగీర్దార్లు జమీందార్లు, భూస్వాములు, అనంతరం వలస పాలకులు, ఇట్లా 100 ఏండ్ల పాటు అనేక రకాల పీడను అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నరు. అన్ని రంగాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నం. తెలంగాణ ఒక గాడిలో పడింది’’ అన్నారు.

‘‘ఉద్యమం ప్రారంభించిన మొదట్లో తెలంగాణ వస్తదా? అని అనుమానపడ్డరు. వచ్చింది. ఇరువైనాలుగు గంటలు కరెంటు అయ్యేదా పొయ్యేదా? అన్నరు. అయ్యింది. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు అయితదా అన్నరు. అయింది. దండుగన్న వ్యవసాయం పండుగైంది. రైతుబంధు తెచ్చినప్పుడు కొందరు పెదవి విరిచిన్రు. ఇవ్వాల తెలంగాణ రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నడు. అట్లనే దళిత బంధును కూడా కొందరు అనుమాన పడుతున్నరు. వారి అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తం. అదే స్ఫూర్తితో దళిత బంధును అమలు చేస్తం. విజయం సాధిస్తం.’’ అని సీఎం స్పష్టం చేశారు.దళిత బంధును విజయవంతం చేయడం ద్వారా, తెలంగాణ సమాజానికే కాదు దేశ దళిత సమాజాభివృద్ధికి హుజూరాబాద్ దళితులు దారులు వేయాలన్నారు. అందుకు పునాది వేద్దామా? అని సభికులతో సీఎం ప్రతిజ్జ తీసుకున్నారు.

తెలంగాణ ప్రజలు గత పాలనలో గొర్రెల మందలో చిక్కుకుపోయిన పులి పిల్లలాంటి వాల్లనే సంగతిని, స్వయంపాలన ఏర్పాటయినంక ప్రపంచం పసిగట్టిందని సీఎం వివరించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం నేడు నివ్వెర పోతున్నదన్నారు. తెలంగాణ రైతాంగం రోహిణీ కార్తెలోనే నాట్లేసుకునే రోజులొచ్చినయన్నారు. ఇంకా సమాజంలో వరకట్నం, అంటరానితనం వంటి పలు వివక్షలు పీడిస్తున్నాయని వాటిని విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ది ద్వారా సాధించవచ్చునన్నారు. వృద్దులు, వంటరి మహిళలు, వికలాంగులు తదితర అభాగ్యులకు ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని, వారి కండ్లల్లో సంతోషం కనిపిస్తున్నదన్నారు. అదే రీతిలో దళిత సమాజం మోములో ఆనందాన్ని చూడాలనేదే తన పట్టుదల అని సీఎం పునరుద్ఘాటించారు.తాను పార్టీ పెట్టిన నాటినుంచి ఎంతో క్రమశిక్షణతో నిబద్దతతో పనిచేసుకుంటూ వస్తున్న శ్రీ బండ శ్రీనివాస్ కు తాను పదవిని మాత్రమే ఇవ్వలేదనీ, తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఆయన నెత్తిన పెద్ద బాధ్యతతో కూడిన ‘బండ’ ను పెట్టానని సీఎం మాట్లాడారు. ఆ సందర్భంగా సభలో నవ్వులు విరిసాయి.

‘‘ఇన్నాళ్లూ ఏవేవో పథకాలు తెచ్చి బ్యాంకుల గ్యారెంటీ అడిగినయి ప్రభుత్వాలు. కాళ్లు, చేతులే ఆస్తులుగా వున్న కడుపేద దళితులు గ్యారెంటీలు ఎక్కడ తెస్తరు? అందుకే దళిత బంధు పథకం ద్వారా ప్రభుత్వం చేసే ఆర్థిక సాయం పూర్తి ఉచితం. ఇది అప్పుకాదు. తిరిగి ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో దళారుల మాటే వుండదు. నేరుగా అర్హులైన లబ్దిదారుల బ్యాంకులో ఆర్థిక సాయం వచ్చి చేరుతుంది’’ అని సీఎం స్పష్టం చేశారు. ‘‘దళితుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచి, వారిలో ధీమా పెరిగి తమ అభివృద్ధిని తామే నిర్వచించుకోగలం అనే భరోసాను కలిగించే ప్రయత్నమే దళిత బంధు పథకం. ఇచ్చిన పైసలు పప్పులు, పుట్నాలకు ఖర్చు చేయకుండా, పైసను పెట్టి పైసను సంపాదించే ఉపాధి వ్యాపార మార్గాలను అన్వేషించాలె. ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అందుకు మీరందరూ కృషి చేయాలె’’ అని సీఎం సభికులనేద్దేశించి స్పష్టం చేశారు.

స్వాతంత్ర్యం వచ్చిన నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత బహుజన వర్గాల బాగు కోసం కొట్లాడిండని సీఎం తెలిపారు. ఆ తర్వాతి కాలంలో బడుగుల బాగును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. గాంధీజీ, అంబేద్కర్ లు వేసిన బాటలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నదని, వారి ఆశయాలను కొనసాగించి దళితుల అభవృద్ధిని సాధించి చూపెడుతామని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రారంభించిన అనేక పథకాలను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని దళిత బంధు పథకాన్ని కూడా దేశానికి ఆదర్శంగా మారుతుందన్నారు. ‘‘ఎక్కడో ఒక దగ్గర ప్రేరణ కావాలి. అది హుజూరాబాద్ అవుతున్నందుకు ఆ గడ్డమీది బిడ్డలుగా మీరందరూ గర్వపడాలి.’’ అని స్పష్టం చేశారు.

‘‘మంచి జరిగి వెలుతురొస్తే ఈ వెలుతురు అణగారిన దళిత వర్గాలందరికీ మేలు జరిగి ఒక తొవ్వ పడుతుంది. హుజూరాబాద్ దళిత నాయకుల పట్టుదల, నిబద్దత, చిత్తశుద్ధి మీద ఆధారపడి వుంది. పార్టీలకతీతంగా దళిత బంధును అమలు చేసుకుందాం. అందరూ కలిసి మెలిసి అన్నాదమ్ముల వలె వుండాలె. చిరునవ్వులతో పరస్పరం పలకరించుకోవాలె. కొట్లాటలు, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు లేని వాడలుగా, దళిత వాడలు ఫరిడవిల్లాలె.‘‘ అని సీఎం ఆకాంక్షించారు. ఒకరి మీద ఒకరు పెట్టుకున్న కేసులను ఎత్తేసుకోవాలని సూచించారు. ఒకరు ఏమాత్రం కింద పడే పరిస్థితి అనిపించినా వెంటనే ఆదుకొనే ఖోజా జాతి మనందరికీ ఆదర్శం కావాలన్నారు. దళిత జాతిలో ఇక ఎవ్వరూ పేదలుగా మిగలకూడదని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ దళిత బంధు పథకం, కేవలం పథకం మాత్రమే కాదని, తెలంగాణ ఉద్యమం మాదిరి దళితుల అభ్యున్నతి కోసం సాగే ఉద్యమం అని పునరుద్ఘాటించారు. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఒకరి అభివృద్ధి కోసం ఒకరు పాటు పడే యజ్జం అని సీఎం తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, రైతు బందు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, హుజూరాబాద్ జెడ్పీటీసీ బక్కారెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర దళిత సంఘాల నేతలు, పలువురు దళిత నాయకులు భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -