28న సీఎం కేసీఆర్‌-జగన్ భేటీ..!

411
kcr jagan
- Advertisement -

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌,జగన్‌ ఈ నెల 28న సమావేశం కానున్నారు. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో నీటి వివాదాలతో పాటు విద్యుత్ ఉద్యోగుల విభజన, 9,10 షెడ్యూల్‌ ఆస్తుల పంపిణిపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రుల భేటీ అనంతరం జూలై 3న ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ప్రత్యేకంగా సమావేశమై విభజన సమస్యలపై చర్చించనున్నారు.

బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌, కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సీఎంల భేటీ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ 811 టీఎంసీలు కేటాయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకుంటున్నాయి. ఇరు రాష్ట్రాలకు ట్రైబ్యునల్‌ ఎదుట వాదనలకు భారీగా ఖర్చవుతోంది. దీంతో పాటు బచావత్‌ ట్రైబ్యునల్‌లోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని, దీనిని సవరించాలని కోరుతూ తెలంగాణ సుప్రీంకోర్టులో కేసు కూడా వేసింది. వీటన్నింటిపై సీఎంలు కేసీఆర్,జగన్‌లు చర్చించుకొని ఓ అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది.

దీంతో పాటు కృష్ణా, గోదావరి బోర్డుల పనితీరు, అసలు ఈ బోర్డుల అవసరం ఉందా అనే అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -