ప్రజలకు పరిశుభ్రమైన మంచినీరు ప్రతీనిత్యం అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం అనుకున్న ప్రకారం నడుస్తుండటంతో కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనులపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ అధికారులు రేయింబవళ్లు కష్టపడి పని చేసి తెలంగాణ రాష్ట్ర గౌరవం పెంచుతున్నారని సీఎం కితాబిచ్చారు. నిర్ణీత గడువులోగా మిషన్ భగీరథ నీరు ప్రజలకు అందేలా పనిచేయాలని ఆదేశించారు.
గ్రామాల్లో పైప్‌లైన్ నిర్మాణం, ఇంటింటికీ నల్లా బిగించే పనులు ముఖ్యమైనవని సీఎం పేర్కొన్నారు. మిషన్ భగీరథను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.22 వేల కోట్ల రుణానికి అంగీకారం కుదిరిందని.. అవసరమైతే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. పనులు సకాలం పూర్తిచేసే గుత్తెదారులకు 1.5 శాతం అదనపు ప్రోత్సాహం అందించనున్నట్లు చెప్పారు. పైప్‌లైన్ వేసేటప్పుడే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయాలన్నారు. భవిష్యత్తులో మిషన్ భగీరథ నిర్వహణ బాధ్యత ఆర్‌డబ్ల్యూఎస్‌దేనని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ ప్రశాంత్‌రెడ్డి మంత్రితో సమానమని.. ఇతర శాఖల మంత్రులు, అధికారులతో ఆయనే సమన్వయం చేస్తారని చెప్పారు.
అతి తక్కువ సమయంలో అనేక అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతున్న ఈ పథకం 2017 డిసెంబర్ నాటికి పూర్తి కావడమే లక్ష్యంగా పని చేయాలని సీఎం చెప్పారు. గ్రామాల్లో పైపులైన్ల నిర్మాణం, ఇంట్లో నల్లాలు బిగించే పనులు అతి ముఖ్యమైనవి అని పేర్కొన్నారు. పథకం ప్రారంభంలో ఎదురయ్యే బాలారిష్టాలను అధిగమించాలని సూచించారు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తప్పక తలెత్తుతాయనే విషయం అందరి దృష్టిలో ఉండాలన్నారు.