సంక్షేమ రంగంలో నంబర్‌వన్‌గా నిలిచాం.. సీఎం కేసీఆర్‌

253
CM KCR
- Advertisement -

సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో సమావేశమైయ్యారు. జిల్లాల అభివృద్ది పనులపై జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం తెలుసుకున్నారు. మెరుగైన పాలన కోసం అవలంభిచాల్సిన విధివిధానాలను కలెక్టర్లకు సూచించారు. సంక్షేమ రంగంలో రూ.30వేల కోట్లకుపైగా ఖర్చు పెడుతూ..నంబర్‌వన్‌గా నిలిచామని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు కావడానికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు రావాలన్నారు. సమాజంలో నెలకొన్న అపసవ్య పరిస్థితులను అరికట్టడం అసాధ్యం కాదన్నారు.

colletorsmeeting

ప్రభుత్వం అంటే కేవలం మంజూరీలు ఇవ్వడం కోసం మాత్రమే అనే అభిప్రాయం ఉందన్నారు. కేవలం డబ్బులతోనే అన్ని పనులు కావు. మంచి పాలసీలు, పథకాలు రావాలి, అవి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని చెప్పారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేసే దురాచారాలను రూపు మాపడంలో విజయవంతమయ్యామని తెలిపారు. ఇదే స్పూర్తితో ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని అన్నారు.

టీఎస్‌ఐపాస్ చట్టం తేవడం వల్ల పారిశ్రామిక విధానం అద్భుతంగా వచ్చింది. టీఎస్ ఐపాస్‌తో 2500 పరిశ్రమలు వచ్చాయి. హరితహారం ద్వారా గ్రీన్ కవర్ పెంచుకుంటున్నాం. పేకాట అరికట్టగలిగాం, గుడుంబాను నిర్మూలించగలుగుతున్నాం. గుడుంబా తయారీ మానేసిన మహిళలకు ఉపాధి చూపించాలని కలెక్టర్లు, మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

సిద్ధిపేట తరహాలో రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు జరుగాలని కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్లు పోటీపడి కార్యక్రమాలను చేపట్టాలని నిర్దేశించారు. త్వరలోనే టీవ్యాలెట్ అందుబాటులోకి వస్తుంది. అన్నింటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. అత్యవసర వినియోగానికి ప్రతీ జిల్లా కలెక్టర్ వద్ద రూ.3కోట్ల నిధులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆస్పత్రులు, వసతి గృహాలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ప్రతి జల్లా కలెక్టర్‌కు రూ.3కోట్లు చొప్పున రూ.93 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

స్థానిక వనరులను గుర్తించి, వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యమని సీఎం అన్నారు. అర్బన్, రూరల్, వ్యవసాయ, పారిశ్రామిక, గనుల పరంగా జిల్లాల వారిగా ప్రాధాన్యాలు మారుతాయి. దీన్ని బట్టి ప్రణాళిక వేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇలా ప్రతీ జిల్లాలో జరగాలని సీఎం నిర్దేశించారు.

కలెక్టర్ల సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు అన్నిశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -