కేసీఆర్‌-కేటీఆర్‌లకు ధన్యవాదాలు తెలిపిన సీజేఐ..

179

అంత‌ర్జాతీయ వాణిజ్య వివాదాల మ‌ధ్య‌వ‌ర్తుల కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో ఇవాళ ప్రారంభించారు. ఆ సెంట‌ర్‌కు చెందిన ట్ర‌స్ట్ డీడ్ రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మాట్లాడారు. తెలంగాణ చ‌రిత్ర‌లోనూ, హైద‌రాబాద్ చ‌రిత్ర లోనూ ఈ రోజు గొప్ప‌దినంగా నిలిచిపోతుంద‌న్నారు. 3 నెల‌ల స‌మ‌యంలోనే త‌న క‌ల నిజ‌మ‌వుతుంద‌ని ఎన్న‌డూ ఊహించ‌లేద‌ని సీజే తెలిపారు. త‌న క‌ల నిజ‌మ‌య్యేలా చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌, సీజే హిమా కోహ్లీకి ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు.

జూన్‌లో హైద‌రాబాద్‌కు వ‌చ్చాన‌ని,ఆ స‌మ‌యంలో ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ గురించి చీఫ్ జ‌స్టిస్‌తో మాట్లాడిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. ఆర్బిట్రేష‌న్ కేంద్రం ఏర్పాటుతో అంత‌ర్జాతీయ‌ స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించువ‌చ్చు అని సీజే అన్నారు.పెట్టుబ‌డిదారులు త‌మ లిటిగేష‌న్‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని కోరుతున్నార‌ని, ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు వ‌ల్ల ఆ స‌మ‌స్య‌లు తీరుతాయ‌న్నారు. దుబాయ్‌లో ఇటీవ‌ల అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్లు ప్రారంభ‌మైన‌ట్లు ఆయ‌న తెలిపారు. మీడియేష‌న్ ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్‌ను ప్రోత్స‌హించాల‌ని ఆయ‌న చెప్పారు. ఈ సెంట‌ర్ వ‌ల్ల స‌మ‌స్య‌లు త్వ‌ర‌గా ప‌రిష్కార‌మ‌వుతాయ‌న్నారు. స‌మ‌యం కూడా చాలా ఆదా అవుతుంద‌న్నారు.

సెంట‌ర్ గురించి అంద‌రికీ తెలిసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న‌ తెలంగాణ చీఫ్ జ‌స్టిస్ హిమా కోహ్లీని కోరారు. ఈ మీడియేష‌న్ సెంట‌ర్ ను ఎలా వాడుకోవాల‌న్న దానిపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. 1926లో మొద‌టి అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ ప్రారంభ‌మైంద‌ని చీఫ్ జ‌స్టిస్ తెలిపారు. ఆర్బిట్రేష‌న్ అండ్ మీడియేష‌న్ సెంట‌ర్ ఏర్పాటులో తెలంగాణ స‌హ‌కారం మ‌రువ‌లేమ‌న్నారు. ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు అయితే అంత‌ర్జాతీయ ఆర్బిట్రేట‌ర్లు ఇక్క‌డ‌కు వ‌స్తార‌న్నారు. పెట్టుబుడిదారులు వివాదాలు లేని వాణిజ్యాన్ని కోరుకుంటున్నార‌ని, అలాంటి వాళ్ల‌కు ఈ సెంట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సీజే తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల‌కు చీఫ్ జ‌స్టిస్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. త్వ‌ర‌లోనే సెంట‌ర్ ఫంక్ష‌నింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ స‌క్సెస్ కావాల‌ని ఆయ‌న కోరుకున్నారు. కేవ‌లం అంత‌ర్జాతీయ ఇన్వెస్టెర్లే కాదు, స్థానిక పెట్టుబ‌డిదారుల వివాదాల‌ను కూడా ఇక్క‌డ ప‌రిష్క‌రిస్తార‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ హిమా కోహ్లీతో పాటు మంత్రులు కేటీఆర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.