తెలంగాణపై కేంద్రం కుట్ర

327
modi
- Advertisement -

తెలంగాణ సర్కారుకు కాగ్ ఊరట
కేంద్రం కుట్ర బట్టబయలు
కేంద్ర సహకారం లేకున్నా బాగానే నెట్టుకొచ్చారు
నివేదికలో స్పష్టంచేసిన కాగ్
కేంద్రం నిర్వాకం వల్లనే తగ్గిన క్యాపిటల్ వ్యయం
గ్రాంట్-ఇన్-ఎయిడ్ నిధుల్లోనూ కోత

కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా, కుట్రపూరితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బతీస్తోందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. రాజకీయపరమైన అభిప్రాయభేదాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్ధికంగా దెబ్బకొడితే రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి-సంక్షేమ పథకాలను నిలిపివేస్తారనే ఉద్దేశ్యంతోనే అనేకరకాల ఆంక్షలు విధిస్తూ వేధింపులకు గురిచేస్తోందనే విమర్శలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు భీమా పథకాలు, దళితబంధు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు ఇలా ఒక్కటేమిటీ అనేక పథకాలు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా ఉండటంతో ఆ పథకాలకు అవసరమైన నిధులు లేకుండా చేస్తే టి.ఆర్.ఎస్.ప్రభుత్వం తనంతట తానుగానే పథకాలను రద్దు చేసుకుంటుందనే ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం అనేకరకాల ఆర్ధిక ఆంక్షలు విధిస్తూనే ఉందని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

ఎందుకంటే తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి-సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని బిజేపీయేతర రాష్ట్రాలే కాకుండా బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్లు, వత్తిళ్ళు పెరుగుతుండటంతోనే ఆ పథకాలను ప్రవేశపెట్టడం ఇష్టంలేకనే కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా తెలంగాణలోని సంక్షేమ పథకాలను రద్దు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సంక్షేమ పథకాలను నేరుగా రద్దు చేసుకోమని చెబితే దేశవ్యాప్తంగా అభాసుపాలవుతామని, అందుచేతనే తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా ఆయా పథకాలను రద్దు చేసుకునేటట్లుగా చేయాలంటే ఆర్ధికంగా దెబ్బతీస్తే సరిపోతుందనే ఉద్దేశ్యంతోనే ఇలా ఆర్ధికమూలలను దెబ్బతీస్తోందని ఆ అధికారులు వివరించారు. ఇలా కేంద్రం కుట్రలు ప్రజలకే కాకుండా చివరకు కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సి.ఏ.జి-కాగ్)కు కూడా అర్ధమయ్యిందని, అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను కొనియాడిందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా సహకరించకపోయినప్పటికీ ఆదాయాన్ని సముపార్జించుకోవడంలోనూ, ఆ నిధులను బడ్జెట్ ప్రాతిపదికగా ఖర్చు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖ అనుసరించిన విధానం భేషుగ్గా ఉందని కాగ్ పేర్కొంది. గత జూన్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 6,874 కోట్ల 96 లక్షల రూపాయల నాన్-ట్యాక్స్ రెవెన్యూ (పన్నేతర ఆదాయం ) వచ్చిందని, ఈ కేటగిరిలో గత ఏడాది జూన్లో 2.96 శాతం మాత్రమే ఆదాయం రాగా ఈ ఏడాది గత జూన్ నెలలో 27.04 శాతం అధికంగా ఆదాయం వచ్చిందని కాగ్ పేర్కొంది. జి.ఎస్.టి.వసూళ్ళల్లో తెలంగాణ సర్కార్ పనితీరు బాగుందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. గత జూన్ నెలలో జి.ఎస్.టి.వసూళ్ళు 9,645 కోట్ల 14 లక్షల రూపాయలు (22.86 శాతం) ఉందని, ఇదే గత ఏడాది జూన్‌లో 18.70 శాతం వరకూ జి.ఎస్.టి. వసూళ్ళు ఉన్నాయని, గత ఏడాది కంటే ఈ ఏడాది 4.16 శాతం ఎక్కువగా ఉంది. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్-ఇన్-ఎయిడ్ నిధులు సుమారు 5,400 కోట్లు (9.05 శాతంకు పైగా) రావాల్సి ఉండగా గత జూన్ నెలలో కేవలం 1425 కోట్ల 71 లక్షల రూపాయలు (3.48 శాతం) వచ్చాయని, అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ ఎక్స్ పెండిచర్ (రెవెన్యూ ఖర్చు) 3.12 శాతం అధికంగానే ఉందని కాగ్ తెలిపింది.

గత ఏడాది జూన్లో 17.05 శాతం రెవెన్యూ ఖర్చులు ఉండగా ఈ ఏడాది జూన్లో 20.17 శాతం (రూ.38,176.46 కోట్సు వరకూ రెవెన్యూ వ్యయం ఉందని కాగ్ తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రుణాల సేకరణపై కేంద్ర ప్రభుత్వం అనేక కుంటిసాకులు చెప్పి వచ్చే నిధులను నిలిపివేయించడంతో ఆ మేరకు క్యాపిటల్ వ్యయం (అభివృద్ధి పథకాలు) కింద ఖర్చు బాగా తగ్గింది. గత ఏడాది క్యాపిటల్ వ్యయం 14.31 శాతం ఉండగా ఈ ఏడాది జూన్లో 8.06 శాతం (రూ.2396 కోట్స్సు మాత్రమే ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్వాకమేనని కాగ్ చెప్పకనే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయ వనరుల నుంచి సేకరించిన నిధులను అంచనాలకు మించి ఖర్చు చేసినప్పటికీ రుణాల సేకరణలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపుల్లలు వేయడంతో రావాల్సిన నిధులు రాకపోవడం మూలంగా అభివృద్ధి పథకాలకు ఖర్చు చేసే క్యాపిటల్ వ్యయం బాగా తగ్గిందని కాగ్ నివేదిక స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్, మే నెలల్లో రుణాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూల్సు మార్చడం మూలంగా, అనేక కుంటిసాకులతో రుణాలిచ్చే ఆర్థిక సంస్థలపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 10,200 కోట్ల రూపాయల నిధులు రాకుండా అడ్డుకున్నందుకు పర్యావసానంగా క్యాపిటల్ వ్యయం తగ్గిందని మరోసారి కాగ్ నివేదికతో స్పష్టం అయ్యిందని ఆర్థికశాఖలోని సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు. రుణాల సేకరణకు కేంద్రం విధించిన ఆంక్షలు, కొర్రీలు, లోపభూయిష్టమైన రూల్సు మూలంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని తాము ఎంత మొత్తుకున్నా వాటిని విమర్శలుగా చూశారని, అధికార టి.ఆర్.ఎస్.పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తే వాటిని రాజకీయపరమైన విమర్శలుగా కొట్టిపారేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పడు కాగ్ నివేదిక సారాంశాన్ని చూసైనా తమ నిర్వాకాల మూలంగా తెలంగాణ వంటి కొత్త రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడిందో అర్ధంచేసుకోవాలని ఆ అధికారులు కోరుతున్నారు.

అప్పలు తెచ్చుకోవడానికి అడ్డుపుల్లలు వేసిన కేంద్రం చివరకు న్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్-ఇన్-ఎయిడ్ నిధులను కూడా ఇవ్వకుండా కోతలు విధించినట్లుగా కాగ్ నివేదిక మరోసారి స్పష్టంచేసిందని ఆ అధికారులు వివరించారు. దీనికితోడు నీతి ఆయోగ్, 14వ ఆర్ధిక సంఘం, 15వ ఆర్ధిక సంఘం సిఫారసులు చేసిన 34,149 కోట్ల రూపాయల నిధులను కూడా ఇవ్వకుండా కేంద్రం సతాయిస్తున్నదని, ఆ నిధులు కూడా వస్తే తెలంగాణలో అభివృద్ధి పథకాలకు ఎలాంటి ధోకా లేకుండా ఖర్చు చేసే అవకాశం ఉండేదని, అదే జరిగితే క్యాపిటల్ వ్యయం రికార్డుస్థాయిలో ఉండేదని ఆ అధికారులు వివరించారు. కేంద్రం ఆంక్షలు విధించకుండా, రుణాల సేకరణలకు న్యాయ విరుద్ధమైన షరతులు విధించకుండా యధావిధిగా తమ ప్రభుత్వానికి అనుమతులిస్తూ వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులకు కొరత ఏర్పడేది కాదని వివరించారు.

ఇవి కూడా చదవండి..

కొరివితో తలగోక్కున్న బిజెపి

బండికి అధిష్టానం అక్షింతలు..

ప్రాంతీయ పార్టీలన్నీ అలర్ట్

- Advertisement -