కొరివితో తలగోక్కున్న బిజెపి

448
- Advertisement -

ఉద్యోగులతో పెట్టుకొన్న బిజెపి
బండిపై కారాలు నూరుతున్న ఎన్జీవోలు
ఉద్యోగులతో పెట్టుకుంటే అంతేమరి…
బండి గెలిపిస్తున్నాడా… ఓడిస్తున్నాడా…
అయోమయంలో బిజెపి కేడర్

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి పనిచేస్తున్నారా…. లేక ఓడించడానికి పనిచేస్తున్నారా… అనే అంశంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్జీవోలు ముఖ్యమంత్రి కెసిఆర్ కు అమ్ముడుపోయారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. బండి వ్యాఖ్యలు బిజెపిలో కూడా వాడీవేడీ చర్చకు దారితీశాయి.

పార్టీని అధికారంలోనికి తీసుకురావాలనుకునే వ్యక్తి సంయమనం పాటించకుండా అడుగడుగునా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మూలంగా పార్టీకి చేటు కలిగిస్తాయనే విషయాన్ని బండి సంజయ్ కు తెలుస్తున్నట్లుగా లేదని అంటున్నారు. ఎందుకంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులతో పెట్టుకొన్న రాజకీయ పార్టీకి ఏ ఎన్నికల్లోనూ కలిసివచ్చిన చరిత్ర లేదని, ఉద్యోగులతో పెట్టుకొన్న వాళ్ళందరూ ఘోర పరాజయాలనే చవిచూశారేగానీ ఎన్నడూ విజయం సాధించలేదనే అంశంపై చర్చ జరుగుతోంది.

ఎన్నికల ప్రక్రియ మొత్తంలో ఉద్యోగులు, పోలీసులు, టీచర్లే ప్రధాన భూమిక పోషిస్తారని, ప్రజలతో మమేకమై విధులు నిరర్తించేది కూడా ఈ మూడు వర్గాలేనని, అలాంటిది పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా ఇలా నోరుపారేసుకుంటే ఎన్జీవోలు, టీచర్లు, పోలీసులు ఎక్కడ బత్తి పెట్టాలో అక్కడ పెడతారని, ఇది ముమ్మాటికీ పార్టీకి నష్టమే చేస్తుందిగానీ, ఎలాంటి ఉపయోగం లేదని ఆరోపణలేనని పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు మదనపడుతున్నారు.

ఎన్నికల రాజకీయాలపై వీసమెత్తు అవగాహన కూడా లేకుండా బండి సంజయ్ నోరుపారేసుకున్నట్లుగా ఉందని పార్టీలోని కొందరు సీనియర్ నాయకులే మండిపడుతున్నారు. ఎనికల విధుల్లో ఉండేది, ప్రజలకు దగ్గరగా పనిచేసేదీ, ప్రజలతో 24/7 కలిసి ఉండేది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులేనని… ఈ ముగ్గురు వర్గాల ఉద్యోగులను తిట్టి రాజకీయాల్లో విజయాలు సాధించిన దాఖలాలు లేవని, ఇప్పుడేమో ఏకంగా టి.ఎన్.జి.ఓ.నాయకులనే తిడుతున్న బండి సంజయ్ కు వారి గురించి అవగాహన ఉండి తిడుతున్నాడా… లేక అవగాహన లేకుండా, గత తెలుసుకోకుండా నోరు పారేసుకున్నాడా? అనేది తెలియడం లేదని అంటున్నారు. గతంలో ఎన్నో పార్టీలు, ప్రభుత్వాలు ఉద్యోగులతో పెట్టుకొని ఎన్నికల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకున్నాయని, ఆ విషయాలు, గత చరిత్ర తెలియకనే బండి సంజయ్ కొరివితో తలగోక్కుంటున్నాడని బిజెపిలోని కొందరు సీనియర్ నాయకులంటున్నారు.

2004 ఎన్నికల్లో, 2009లో జరిగిన ఎనికల్లో తెలుగు దేశం పార్టీ ఉద్యోగులు, ఎన్జీవోలతో పెట్టుకొని ఘోరపరాజం పాలయ్యిందని వివరించారు. మరీ ముఖ్యంగా 2009 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికే ఉద్యోగులు మద్దతుగా ఉన్నారని,ఉద్యోగులు, టీచర్లు, కార్మికులు, ఎన్జీవోలు మొత్తం అప్పటి కాంగ్రెస్ పార్టీకే సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారని, అందుచేతనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న ఉద్యోగులను ఎగ్జికల విధుల్లో వినియోగించవద్దని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎనికల సంఘాని కోరింది.

ఏపీలో ఉన్న ఉద్యోగులను ఎన్నికల విధుల నుంచి తప్పించి కేంద్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగులను రప్పించి ఎన్నికల విధుల్లో చేర్చాలని అప్పటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ (టి.డి.పి.పి) నాయకుడు కింజారపు ఎర్రనాయుడు కేంద్ర ఎనికల సంఘాన్ని కోరారు. ఈ వార్త కాస్తా ఆ నోటా ఈ నోటా బయటకు పొక్కింది. పెనుదుమారాన్ని సృష్టించింది. ఉద్యోగులు, ఎన్జీవోల ఇగో హర్టయ్యింది. వెంటనే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చాపకింద నీరులా ఉద్యమం చేపట్టారని తెలిపారు.

అన్ని జిల్లాల్లోని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఫోన్లు మీద ఫోన్లు వెళ్ళాయని, ఉద్యోగులందరూ టి.డి.పి.కి వ్యతిరేకంగా పనిచేయాలని తీర్మానించుకొని ఓడించారని వివరించారు. అంతకంటే ఘోరంగా ఇప్పుడు సోషల్ మీడియా కూడా జత కలిసిందని, ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఉద్యోగవర్గాలను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి.

ఎన్జీవోలు అధికార పార్టీకి అమ్ముడుపోయారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సొంతపార్టీలోని అగ్రనేతలకే మింగుడు పడటం లేదని, అంతేగాక బండి సంజయ్ మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించడానికి ఇలా మాట్లాడారా… లేక రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి ఈ వ్యాఖ్యలు చేశారో… అర్ధం కావడం లేదని ఆ
నేతలు మదనపడుతున్నారు.

ఎన్జీవోలు ముఖ్యమంత్రి కె.సి.ఆర్.కు అమ్ముడుపోయారని బండి సంజయ్ ఎలా చెప్పగలరని, ఆయన దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? లేక అమ్ముడు పోయినట్లుగా బండి సంజయ్ చూశారా? ఏ ప్రామాణికంతో ఎన్జీవో నేతలు అమ్ముడుపోయారని తిడుతూ చేసిన వ్యాఖ్యలపై ఎన్జీవో నాయకులు ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు ఎవ్వరికి చేతనైనంత వరకూ వారు బి.జె.పి.కి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నారని అంటున్నారు.

ఈసాటికే గ్రామాల్లో పనిచేస్తున్న టీర్లు, రెవెవ్యూశాఖకు చెందిన కొందరు ఉద్యోగులు సైతం మునుగోడులో బి.జె.పి.కి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించినట్లు తలెసింది. అందుకే బండి సంజయ్ బిజెపికి శిరోభారంగా మారాడని ఆ నాయకులు మండిపడుతున్నారు. పైగా ఎన్జీవోలను గానీ వారి నాయకులను గానీ అవినీతిపరులుగా, లంచగొండులుగా, ముడుపులు స్వీకరించారని ఎవ్వరు ఆరోపణలు చేసినా ఆ ఎన్జీవోలు ఎక్కడా పెద్దగా పట్టించుకోరనే విషయం బండి సంజయ్ కు తెలియకపోవడం బాధాకరమని అంటున్నారు.

విద్యావంతులు, చైతన్యవంతులు అయిన ఓటర్లుగా ఉద్యోగులు, టీచర్లు, ఎన్జీవోలు ఉంటారని, తమ నాయకులను తిడితే ఎవ్వరూ మౌనంగా చూస్తూ ఊరుకోరని, వారి వారి స్థాయిలో తగిన గుణపాఠం చెబుతారని అంటున్నారు. అందుకే బండి సంజయ్ నోరు దురుసుతనం ముమ్మాటికీ పార్టీకి నష్టమే చేస్తుందని ఆ సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు.

అందులో భాగంగానే బండి సంజయ్ ఎన్జీవోలు అమ్ముడుపోయారని ధ్వజమెత్తిన వెంటనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు సోషల్ మీడియా, వాట్సప్, ఫేస్ బుక్ లలో వాట్సప్ ఫోన్ కాల్స్ చేసుకొంటూ బిజెపికి వ్యతిరేకంగా పనిచేయాలని ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులందర్జీ ఆయా సంఘాల నాయకులు కోరినట్లు తెలిసింది. ఇది చాలదన్నట్లుగా మంగళవారం మళ్ళీ తన ఆరోపణలను సమర్ధించుకొంటూ మళ్ళీ మీడియా సమావేశంలో ఎన్జీవోలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలతో ఉద్యోగవర్గాలను ఏకంచేశాయని అంటున్నారు.

ఎన్జీవోలు అమ్ముడు పోయారని బండి చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చిపోయి చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్ వర్గాలకు మరింత కోపాన్ని తెప్పించాయని, కానీ ఈ విషయమే బండి సంజయ్ కు అర్ధం కావడం లేదని అంటున్నారు. ఈ వివాదం ఎంతదాకా పోతుందో… మునుగోడు ఉప ఎన్నికల విధుల్లో ఉన్న ఎన్జీవోలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్ వర్గాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయో…వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి..

నిన్న ఆడియో, రేపు వీడియో

బండికి అధిష్టానం అక్షింతలు..

ప్రాంతీయ పార్టీలన్నీ అలర్ట్

- Advertisement -