బండికి అధిష్టానం అక్షింతలు..

498
bandi
- Advertisement -

కిషన్ రెడ్డికి ఢిల్లీకి పిలిచి మరీ క్లాస్
వారిద్దరి ఓవర్ యాక్షన్ తోనే సభ రద్దు?
చెత్త వాగుడుతో పార్టీ పరువు తీస్తున్నారు..?
బండారం బయటపడ్డాక ప్రమాణాలెందుకో…
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ అట్టర్ ఫ్లాప్
ఆపరేషన్ ఆకర్ష్ అమలులో రాష్ట్ర బిజెపి ఫెయిల్

దేశవ్యాప్తంగా బిజెపి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తెలంగాణ రాష్ట్రంలో అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆ పార్టీ అధిష్టానం పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆపరేషన్ ఆకర్ష్ ను విజయవంతంగా అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు పూర్తిగా వైఫల్యం చెందారని కమలం పార్టీ అధిష్టానం అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో అక్షింతలు వేసినట్లుగా తెలిసింది. టి.ఆర్.ఎస్.ఎమ్మెల్యేలు పక్కా ప్రణాళికతో బి.జె.పి.దూతలను ఇరికించేంత వరకూ ఎవ్వరూ పసిగట్టలేకపోయారని, ఇది ముమ్మాటికీ రాష్ట్ర నేతల ఫెయిల్యూరేనని, అంతేగాక అధికారంలో ఉన్న టి.ఆర్.ఎస్.పార్టీ అలర్ట్ అయ్యే విధంగా నోరుపారేసుకొని పార్టీకి తీరని నష్టం చేశారని కూడా పార్టీ అధిష్టానం వీరిరువురు నేతలపై తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలిసింది. అంతేగాక అధ్యక్షుడు బండి సంజయ్, కిషన్ రెడ్డిల ఓవర్ యాక్షన్ మూలంగానే జాతీయస్థాయిలో పార్టీ పరువు మంటగలిసిందని ఢిల్లీ పెద్దలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీనికితోడు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో రెడ్ హ్యాండెడ్ గా బిజెపి దూతలు పోలీసులకు దొరికిపోవడం, ఆడియో రికార్డులు బయటపడిన తర్వాత జాతీయస్థాయిలో పార్టీ పరువు పోయిందని, ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీల నేతలు బిజెపిని దోషిగా నిలబెట్టి ఘాటైన పదజాలంలో విమర్శిస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బిజెపియే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందనే పదాలతో విమర్శలు గుప్పిస్తుండటంతో బిజెపి ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కొందరు కమలం పార్టీ నేతలే అంటున్నారు.

పార్టీ ఫిరాయింపులను నిరోధించాల్సిన అధికార పార్టీయే పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని, సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోయిందని, ఇదంతా బండి సంజయ్, కిషన్ రెడ్డిల ఓవర్ యాక్షన్ మూలంగానే జరిగిందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని తెలిపారు. అంతేగాక ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం బట్టబయలు అయిన తర్వాత కూడా బండి సంజయ్ దేవాలయంలో ప్రమాణం చేయడం, అది చాలదన్నట్లుగా “ఎమ్మెల్యేలు పార్టీ మారితే తప్పేంటి” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడంతో ‘దొంగ దొరికినట్లు’గా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని అగ్రనేతలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. దీనికితోడు ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా మీడియాతో మాట్లాడుతూ మునుగోడు అసెంబ్లీ ఎనికలు ముగిసిన తర్వాత ఎనిమిది మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారు ఎప్పటుంచో తమతో టచ్ లో ఉన్నారని నోరుజారిన వైనం కూడా బిజెపిలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ఇలా పార్టీలోని నాయకులే ఓవర్ యాక్షన్ చేస్తూ అధికార టి.ఆర్.ఎస్.పార్టీ అప్రమత్తమయ్యేటట్లుగా నోరు జారితే ఎలా… మీకు డిసిప్లేన్ లేదా… ఏది సీక్రెట్ గా ఉంచాలో…. ఏది బహిర్గతం చేయాలో…. కూడా తెలియకపోతే ఎలా…? అని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలపై కోపంతో ఉన్నారని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడానికి రంగంలోకి దింపిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన బి.ఎల్.సంతోష్ పేరు ఆడియో రికార్డుల్లో బయటపడటంతో కొనుగోళ్ళ వ్యవహారమంతా నిజమేనని నమ్మే పరిస్థితులు దాపురించాయని, అందుకు ముమ్మాటికీ బండి సంజయ్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావుల అత్యుత్సాహమే ప్రధాన కారణమని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నారని తెలిపారు.

పైగా తెలంగాణ రాష్ట్ర బిజెపి నేతలు అధికార పార్టీపైన, ప్రభుత్వం పైన విమర్శలు చేసే సమయంలో కూడా అన్ పార్లమెంటరీ భాష వాడుతున్నారని, ఈ విషయంలో బండి సంజయ్ నోరు హద్దూ అదుపూ లేకుండా వాగుతున్నాడని, ఇది రాష్ట్రంలో పార్టీకి చెబ్బపేరునే తెస్తోందని పలువురు సీనియర్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారని వివరించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ళకు జరిగిన బేరసారాల్లో ఎపిసోడ్లో రాష్ట్ర బిజెపి నేతలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును చాలా తక్కువగా అంచనా వేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందుకే దొరికిపోయారని కమలం పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కేవలం రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలతోనే ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా కెసిఆర్‌ను చూడకుండా, కేవలం ఒకసాదా సీదా నేతగా పరిగణించారు కాబట్టే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని కమలం పార్టీ నేతలు మదనపడుతున్నారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్య అతిధిగా పిలిచి భారీ బహిరంగ సభ నిర్వహించాలని తొలుత పార్టీ పెద్దలు నిర్ణయించారని, వీరిద్దరి (బండి సంజయ్, కిషన్ రెడ్డి) ఓవర్ యాక్షన్లు, పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గంలో ఎదురవుతున్న నిరసనలు, చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని రిపోర్టులు రావడంతోనే అమిత్ షా పర్యటన రద్దయ్యిందని, ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సభకు వస్తారని ఏర్పాట్లు కూడా చేశామని,కానీ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం బట్టబయలు కావడంతో ఆయన కూడా మునుగోడు ఎన్నికల ప్రచార పర్యటనను రద్దు చేసుకొన్నారని తెలిపారు. ఈ మొత్తం పరిణామాలగే బండి సంజయ్, కిషన్ రెడ్డిల ఓవర్ యాక్షన్, ఎమ్మెల్యే రఘునందన్ రావుల నోరుజారడాలతోనే ఇబ్బందులు తలెత్తాయని పార్టీలో పలువురు సీనియర్ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోయిన పరువును తిరిగి రాబట్టుకోవడానికి, జరిగిన డ్యా మేజ్ ను సరిదిద్దుకోవడం అంత సులభమైన ప్రక్రియ కాదని, జరిగిన నష్టానికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ నేతలు మదన పడుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న ఓటర్లు ఉన్నారని, ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ రాష్ట్రమనే విషయాన్ని బిజెపి నేతలు, అధిష్టానం పెద్దలు విస్మరించినట్లున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే ఎంతో నీతి, నిజాయితీ, నిబద్దత, పటిష్టమైన సిద్ధాంతాలు, క్రమశిక్షణతో పనిచేస్తేనే విజయాలు సాధించగలుగుతామని, లేకుంటే ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా అంతులేని నష్టాలు జరుగుతాయని ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం మరోసారి నిరూపించిందని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ పరువు, ప్రతిష్టలు మంటగలిశాయని, ఇకనైనా పార్టీ సిద్ధాంతాల ఆధారంగా క్రమశిక్షణ, నిజాయితీతో రాజకీయాలు చేస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని, లేకుంటే కోలుకోవడం కష్టమని కమలం పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులే అంటున్నారు. ఇకనైనా బిజెపి నేతలు పద్ధతి మార్చుకొంటారో…లేదో… వేచి చూడాలి.

- Advertisement -