కాషాయపార్టీకి ఘోర అవమానం..!

169
bjp
- Advertisement -

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తిట్ల పంచాంగంతో విరుచుకుపడుతున్నారు. ఎన్నికలలో గెలుపు మాదంటే మాది అని సవాలు విసురుకుంటున్నారు. మమతా దీదీ దోపిడీ పాలనను అంతం చేసి బంగారు బంగ్లా చేస్తామంటూ మోదీ, అమిత్‌షాలు కాలికి బలపం కట్టుకుని మరీ బెంగాల్‌లో తిరిగేస్తున్నారు. మరోవైపు గాయపడిన పులి పంజా ఎలా ఉంటుందో చూపిస్తానంటూ.. మమతా బెంగాల్‌ను సుడిగాలిలా చుట్టేస్తూ వీల్‌ఛైర్‌లోనే ప్రచారం చేస్తూ బెంగాల్ ప్రజల్లో సెంటిమెంట్ రగిలిస్తున్నారు. ఇక కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల మోదీ సర్కార్ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.

ప్రస్తుతం దేశంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు రైతు సంఘాల నేతలు తికాయత్, బల్బీర్ సింగ్ వంటి నేతలు సిద్దమయ్యారు. ఈ మేరకు బల్బీర్ సింగ్ కోల్‌కతాకు వెళ్లగా..తికాయత్ తమిళనాడుకు వెళుతున్నారు. రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద సంఖ్యలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోంకు వెళ్లి బీజేపీకి ఓటు వేయవద్దని అక్కడి ప్రజలను కోరుతున్నారు. అయితే బెంగాల్‌లో బీజేపీ పట్ల అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఏడేళ్లుగా కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బెంగాల్ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్‌తో సహా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, నల్ల వ్యవసాయ చట్టాలపై బెంగాల్‌లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ నేతలకు బెంగాల్ ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. చెప్పులు చూపించి మరీ వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు.

తాజాగా బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ నేతలకు అక్కడి ప్రజలు చెప్పులతో స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక బీజేపీ డౌన్ డౌన్ అంటూ స్థానిక ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. తమ ఊరిలోకి అడుగుపెట్టవద్దని బీజేపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. జనం ఆగ్రహాన్ని తట్టుకోలేని బీజేపీ నేతలు తమ వాహనాలను వెనక్కి తిప్పుకుని జారుకున్నారు. మొత్తంగా బెంగాల్‌లో బీజేపీ నేతలకు చెప్పులతో స్వాగతం పలికిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మోదీ, అమిత్‌షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా..బెంగాల్‌లో మళ్లీ మమతదే అధికారం అని, బీజేపీకి చావుదెబ్బ తప్పదని, అందుకు బీజేపీ నేతలకు బెంగాల్ ప్రజలు చెప్పులు చూయించిన ఈ వీడియోనే సాక్ష్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా బెంగాల్ ప్రజలు చెప్పులు చూయించడంతో అవమానభారంతో వెనుదిరిగిన బీజేపీ నేతల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -