బిగ్ బాస్ ఎపిసోడ్ 35…గంగవ్వ ఔట్

154
episode 35

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 35 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. శనివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ కావడం, నాగార్జున ఎంట్రీ ఉండటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అందుకు తగ్గట్లుగానే వారం రోజుల ఎపిసోడ్‌ను రిపీట్ చేసిన నాగ్‌…సొహైల్,మెహబూబ్‌లకు క్లాస్ పీకడం,అవినాష్‌పై ప్రశంసలు,అభిజిత్ వల్లే హోటల్ టీం ఓడిపోయిందని పదేపదే చదువు ప్రస్తావన తీసుకురావొద్దని సూచించడం ఇక ముఖ్యంగా గంగవ్వ కోరిక మేరకు ఆమెను హౌస్‌ నుండి పంపించి వేస్తూ ఇల్లు కట్టిస్తా అంటూ ప్రామిస్ చేశారు నాగ్ . .

బుట్టబొమ్మ సాంగ్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన నాగార్జున….తర్వాత మన టీవీలో చూద్దాం అంటూ ఇంటి సభ్యుల్ని చూపించారు. అనంతరం ఇంటి సభ్యులందరిని సోఫాలో కూర్చోవాలని ఆదేశించిన బిగ్ బాస్…ఎన్నిసార్లు హెచ్చరించిన బిగ్ బాస్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని క్లాస్ పీకారు. కెప్టెన్‌కి ప్రయోజనాలతో పాటు బాధ్యతలు ఉంటాయని వాటిని సొహైల్ పదేపదే విస్మరించారని తెలిపారు. ఫలితంగా బిగ్ బాస్ తదుపరి ఆదేశం వచ్చేవరకూ ఎలాంటి అనౌన్స్ మెంట్ వచ్చినా కెప్టెన్‌గా ఉన్న సొహైల్ కెమెరాల దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని శిక్ష వేశారు.

తర్వాత మోనాల్…అభిజిత్- అఖిల్ ఇద్దరితో డ్రామాలు మొదలుపెట్టింది. అయితే ఇది నచ్చని అఖిల్‌ …మోనాల్‌కి క్లాస్ పీకాడు. వెంటనే అఖిల్‌ని కూల్ చేస్తూ నువ్వు నా మెడిసిన్‌ నువ్వు పక్కన ఉంటే బెటర్‌గా ఉంటుందని మోనాల్‌ తెలపగా ఈ మెడిసిన్ ఎక్స్‌పెయిరీ అయిపోయింది అంటూ గట్టి పంచ్ ఇచ్చాడు అఖిల్.

ఇక తర్వాత ఒక్కొక్కరి గురించి ఈ వారంలో జరిగిన దాని గురించి చెబుతూ వచ్చిన నాగ్‌…సొహైల్, మెహబూబ్‌లకు గట్టి క్లాస్ పీకాడు. బిగ్ బాస్ మీకు కొరడా దెబ్బలు పడతాయని హెచ్చరించాడని తెలిపాడు. సొహైల్ కోపం తగ్గించుకోవాలని తెలపగా ఇకపై కోపం తెచ్చుకోనని ప్రామిస్ చేశాడు సొహైల్. ఇక మెహబూబ్ పుచ్చలు పగిలిపోతాయని అనడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపాడు నాగ్. తర్వాత అవినాష్‌ పర్ఫామెన్స్‌కు హ్యాట్సాఫ్ తెలిపిన నాగ్…బాగా ఆడుతున్నావని కితాబిచ్చాడు. అభిజిత్ వల్లే బీబీ హోటల్ టాస్క్‌లో హోటల్ టీం ఓడిపోయిందని పదేపదే చదువు ప్రస్తావన తీసుకురావడం మంచిది కాదని అది సంస్కారం అనిపించుకోదని అభికి చురకలంటించాడు నాగ్.

గత వారం రోజులుగా గంగవ్వ ఆరోగ్యం బాలేకపోవడంతో మెడికల్ రిపోర్ట్స్ చూసిన ఆమెను కన్వెషన్ రూంకి పిలిచి మాట్లాడారు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నా,ఆట కూడా ఆడటం లేదు, తిండి లేదు, నిద్రలేదు అని బోరున విలపించడంతో కంటతడి పెట్టిన నాగ్…గంగవ్వను ఇంటి నుండి పంపించేయాలని బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేశాడు. బిగ్ బాస్ కూడా ఓకే చెప్పడంతో ఇంటి సభ్యులంతా బోరున విలపించారు. ముఖ్యంగా అఖిల్ కంటి వెంబడి నీళ్లు ఆగలేదు. నా గురించి ఎవరూ ఏడ్వకండి బయటకు వచ్చిన తరువాత మీ అందరికీ కోడి కూర వండిపెడతా అంటూ ఇంటి సభ్యులకు ధైర్యం చెప్పింది గంగవ్వ.

తర్వాత స్టేజ్ మీదికి రాగానే హ్యాపీనా గంగవ్వా అని అడిగారు నాగార్జున. గుడిసెలో ఉండే నాకు ఈ బిగ్ బాస్ ఇళ్లు బంగ్లాలా ఉందని…అంతా నన్ను బాగా చూసుకున్నారని తెలిపింది. బిగ్ బాస్‌లో తన జర్నీని చూసి ఎమోషనల్ అయిన గంగవ్వ తర్వాత ఇంటి సభ్యులు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ అందరిలో ధైర్యం నింపింది.

హారిక అప్పుడే నవ్వుతుంది.. అప్పుడే గొడవపడుతుందని చెప్పింది. సొహైల్ నాగసర్పం లాంటోడు.. కోపం వస్తే నరాలు తేలుతాయి.. అతనిలో మంచి లేదు అంటూ గాలి తీసేసింది. అఖిల్ మంచోడని తెలిపింది. అమ్మా రాజశేఖర్ అయితే హౌస్‌లో ఉండాలని.. సినిమా తీస్తే నాకు వేషం ఇవ్వాలని కోరింది. మోనాల్ అ చెడు ఏం లేదు.. తెలియక చేస్తుందని చెప్పింది. నోయల్ అయితే హౌస్ నుంచి బయటకు వెళ్లిన తరువాత ఇంకో పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చింది.

లాస్య తనకు పెద్ద బిడ్డలెక్క అని చెప్పింది గంగవ్వ. సుజాత నామినేట్ అవుతుందనిపిస్తుందని చెప్పింది. అరియానా చూస్తే చిన్న పిల్లలా ఉంటుందని.. ఏదైనా ఉంటే ముఖంపైనే అనేస్తుందని చెప్పింది గంగవ్వ. అవినాష్ కుందేలు లెక్క.. ఆటలు పాటలతో అలరిస్తాడని చెప్పింది. మెహబూబ్ ఆటలు బాగా ఆడుతున్నాడని.. కుమార్ సాయి ఇప్పుడు అందరితో కలిసిపోతున్నాడని తెలిపింది గంగవ్వ.

తనకు ఇల్లు కట్టివ్వాలని అవకాశం వచ్చిన ప్రతిసారి కోరిన గంగవ్వకు అభయమిచ్చాడు నాగ్‌. నీకు ఇళ్లు కావాలనే అన్నావు కదా. నీకు ఇళ్లు కట్టిస్తా.. నువ్ హ్యాపీగా ఇంటికి వెళ్లు.. నీ ఇంటి పని మొదలౌతుందని హామీ ఇచ్చారు నాగ్‌. ఇక చివరలో అఖిల్‌ని నామినేషన్స్‌ నుండి సేవ్ చేసింది గంగవ్వ. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న 9 మందిలో ఇద్దరు సేవ్ కావడంతో ఏడుగురిలో ఒకరు నేటి ఎపిసోడ్‌లో ఎలిమినేట్ కాబోతున్నారు.