గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్..

177
Bhupendra Patel
- Advertisement -

గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యారు. ఈరోజు గాంధీన‌గ‌ర్‌లో జ‌రిగిన‌ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంలో ఎమ్మెల్యేలంతా ఏక‌గ్రీవంగా భూపేంద్ర ప‌టేల్‌ను త‌మ నాయ‌కుడిగా ఎన్నుకున్నారు. భూపేంద్ర ప‌టేల్ పేరును మాజీ సీఎం విజ‌య్ రూపానీ ప్ర‌తిపాదించ‌గా మిగ‌తా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. కేంద్ర ప‌రిశీల‌కుడు న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ భూపేంద్ర ప‌టేల్‌ను ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు.

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఎన్నికైన‌ భూపేంద్ర ప‌టేల్ ప్ర‌స్తుతం ఘట్లోడియా నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ శ‌నివారం త‌న‌ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో.. కొత్త ముఖ్య‌మంత్రిని ఎన్నుకునేందుకు ఈరోజు ఆ రాష్ట్ర శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశమైంది.

ఈ సమావేశంలో బీజేపీ హైకమాండ్ పరిశీలకులుగా కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. భూపేంద్ర పటేల్ ను బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేల అభీష్టాన్ని గౌరవిస్తున్నట్టు పరిశీలకుల హోదాలో హాజరైన తోమర్, జోషి పేర్కొన్నారు. ఈ సమావేశానికి విజయ్ రూపానీ, కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా హాజరయ్యారు.

కాగా,ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రిల అమిత్‌ షా స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఎవరూ ఊహించని విధంగా చోటుచేసుకున్న పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎలాంటి ప్రత్యేకమైన కారణం చెప్పకుండానే సీఎం విజయ్‌ రూపానీ అకస్మాత్తుగా గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించడం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

- Advertisement -