ఆర్జీ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. చంచల్ గూడ జైలు నుంచి రాజీవ్, శ్రవణ్ ను రెండు రోజుల కస్టడీ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరుగా విచారిస్తున్నారు.
ఈ క్రమంలో శిరీష మృతి కేసులో, ఆమె స్నేహితుడు శ్రవణ్ పోలీసులకు కీలక సమాచారాన్ని అందించాడు. ఈ కేసులో మరో ఇద్దరు ఎస్ఐల పేర్లను ఆయన చెప్పాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు, మే 30, 31న కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి తాను ఫోన్ చేశానని, ఓ సమస్య ఉందని, దాన్ని సెటిల్ చేయాలని కోరానని శ్రవణ్ తెలిపాడు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లోని ఎస్సై హరీందర్ కు ఫోన్ చేసిన ప్రభాకర్ రెడ్డి, ఈ కేసును ప్రత్యేకంగా చూడాలని 31వ తేదీన కోరాడని, అయితే, దీన్ని మరో ఎస్ఐ శ్రీనివాస్ విచారిస్తున్నట్టు హరీందర్ చెప్పాడని అన్నాడు. ఆ తరువాత మరో రెండు సార్ల ప్రభాకర్ రెడ్డితో తాను మాట్లాడానని, కేసును సెటిల్ చేయడంలో బంజారాహిల్స్ పోలీసులు విఫలం కావడంతోనే, ప్రభాకర్ రెడ్డి తమను కుకునూరుపల్లికి పిలిచారని చెప్పాడు. జూన్ 4న రాజీవ్, శిరీషలతో కలసి బంజారాహిల్స్ పీఎస్ కు వెళ్లామని, కేసు ఎటూ తేలకపోవడంతోనే 12న కుకునూరుపల్లికి వెళ్లామని అన్నాడు. శిరీషను ఎస్ఐ ప్రభాకర్ ఏం చేశాడన్న విషయం తనకు తెలియదని చెప్పాడు. ప్రస్తుతం పోలీసును నిన్న రాజీవ్ చెప్పిన అంశాలను, నేడు శ్రవణ్ చెప్పిన అంశాలను బేరీజు వేస్తున్నారు.
నిన్నటి పోలీసుల విచారణలో రాజీవ్ సంచలన విషయాలు వెల్లడించాడు….కుక్కునూరుపల్లిలో ఎస్సై ప్రభాకర్ అత్యాచారయత్నం చేస్తున్నట్టు తలుపు సందుల్లోంచి కనిపించిందని చెప్పినట్టు తెలిసింది. తేజస్విని పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని రాజీవ్ చెప్పాడు. శిరీషను వదిలించుకోవాలనే కుకునూర్‌పల్లి పీఎస్‌కు వెళ్లానని తెలిపాడు. పెళ్లికి ముందు ఇద్దర్నీ వదిలించుకోవాలని అనుకున్నా.. అంతేకానీ శిరీషను చంపాలన్న ఉద్దేశం తనకు లేదని నిజానిజాలు ఒప్పకున్నాడు. ఈ విషయాలన్నీ తెలిసే శిరీష ఆత్మహత్య చేసుకుందని విచారణలో రాజీవ్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
అయితే ఆ రోజు సిగరెట్ తాగేందుకు శ్రవణ్, రాజీవ్ బయటకు వచ్చారని, అక్కడే శ్రవణ్, రాజీవ్ కు అమ్మయిల దగ్గరకు వెళ్దామని ఎరవేశాడంటూ చెబుతున్న వాదన దగ్గర పొంతన కుదరడం లేదు. దీంతో ఇద్దరి మాటల మధ్య వ్యత్యాసం ఉంటే..నిజానిజాలు రాబట్టడం ఎలాగో పోలీసులకు బాగా తెలుసన్న సంగతి తెలిసిందే. శ్రవణ్ ను మరింతగా విచారించాల్సి వుందని, నేడు, రేపు శ్రవణ్ ను మరింత లోతుగా ప్రశ్నించి తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు శిరీషను రాజీవ్, శ్రవణ్ లు మాత్రమే చంపలేదని ఆమె పిన్ని ఆరోపించారు. ఆరు అడుగుల పొడవైన శిరీషను ఒక్కరో లేక ఇద్దరో లోంగదీసుకోవడం అయ్యేపని కాదని ఆమె చెప్పారు. శిరీష హత్యలో ముగ్గురో లేక నలుగురో ఉండి ఉంటారని ఆమె చెప్పారు. శిరీష ఆత్మహత్య ఘటన అనంతరం ఆమె హ్యాండ్ బ్యాగ్ ను ఆమె భర్త పోలీసులకు ఇచ్చాడని, అయితే కారులో ఉన్న మరొకరి హ్యాండ్ బ్యాగ్ ఎవరిదని ఆమె అడిగారు. ఈ కేసులో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని నిర్ధారించేందుకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలని ఆమె ప్రశ్నించారు. ఆ రోజు ఫ్యాంటు, షర్టు వేసుకున్న శిరీష దగ్గరకి చున్నీ ఎలా వచ్చిందని ఆమె నిలదీశారు. శిరీషను హత్య చేశారని ఎవరికైనా అర్థమవుతుందని ఆమె తెలిపారు.