పేదల జీవితాల్లో వెలుగునింపడానికే ‘బిసి కమిషన్‌’

351
- Advertisement -

సమాజంలో దారిద్ర్య రేఖకు దిగువ(బిపిఎల్)న ఉన్న కుటుంబాలను దారిద్ర్య రేఖ ఎగువ(ఎపిఎల్)కు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ విషయంలో బిసి కమిషన్ సమాజంలోని వివిధ కులాల స్థితిగతులు సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగు సూచనలు, ప్రతిపాదనలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కోరారు. తెలంగాణలో తమిళనాడులో మాదిరిగా రిజర్వేషన్ల శాతం పెంచేందుకు శాసనసభలో చట్టం చేసి పార్లమెంటుకు పంపనున్నట్లు సిఎం వెల్లడించారు. బిసి కమిషన్ చైర్మన్ గా బి.ఎస్.రాములు, సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరి గౌరీశంకర్, ఆంజనేయ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిసి కమిషన్ చేయాల్సిన పనులు, బిసి కులాల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి సూచనలు చేశారు.

“తెలంగాణలో 80 శాతానికి పైగా బలహీన వర్గాల ప్రజలున్నారు. వారి జీవన పరిస్థితుల్లో మెరుగుదల రావాలి. తెలంగాణలో రిజర్వేషన్లు పెరగాలి. తమిళనాడులో అక్కడి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకున్నారు. పార్లమెంటు కూడా ఆమొదం పొందిందని.. తెలంగాణ విషయంలో కూడా అదే జరగాలి. తెలంగాణలో బలహీన వర్గాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచడానికి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుతాం. కేంద్రాన్ని ఒప్పించి రిజర్వేషన్లు పెంచుతాం” అని సిఎం క్రేసీఆర్ స్పష్టం చేశారు.

“ముస్లింల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సుదీర్ కమిటీ సిఫార్సులు కూడా ప్రభుత్వానికి అందాయి. సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో బిసి కమిషన్ సిపారసులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిసీల్లో ఉన్న కులాల ప్రయోజనాలు దెబ్బతినకుండానే, రిజర్వేషన్ శాతాన్ని పెంచి ముస్లింలకు రిజర్వేషన్ పెంచే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది” అని సిఎం ప్రకటించారు.

“బిసిలలో అనేక కులాలున్నాయి. కొన్ని కులాల వారు తమ కుల వృత్తుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. మరికొన్ని కులాల విషయంలో మాత్రం దిక్కుతోచకుండా ఉంది. మారుతున్న జీవనవిధానం వల్ల కొన్ని కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా ఆ పనులపై ఆధారపడిన కులాలు, కుటుంబాలు ఉపాది కోల్పోతున్నాయి. ఈ విషయంలో బిసి కమిషన్ సమగ్ర అధ్యయనం చేయాలి. సదరు కుల వృత్తులను మానవాభిరుచికి తగినట్లు ఆదునీకరించడమా? అనే విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. వారినలా వదిలేస్తే ఏ దారి లేకుండా నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉంది. అందుకే అన్ని కులాల స్థితగతులపై లోతుగా అధ్యయనం జరగాలి. ఎవరి జీవితం ఎలా ఉందో అంచనాకు రావాలి. ఎవరి విషయంలో ఏమి చేయాలనే విషయంలో స్పష్టత ఉండాలి. అందుకనుగుణంగా వాస్తవాల ఆధారంగా బిసి కమిషన్ సిఫారసులు చేయాలి” అని ముఖ్యమంత్రి కోరారు.

“తెలంగాణలో సగం జనాభా బిసిలే. వారి జీవన పరిస్థితుల్లో మెరుగుదల రావాలి. బిసి కమిషన్ పాత్ర పెరగాలి. విశ్వసనీయత పెరగాలి. అటు ప్రభుత్వంతో, ఇటు ప్రజలతో నిత్యం సంప్రదింపులు జరపాలి. ఆచరణయోగ్యమైన మార్గం వెతకాలి. 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ దాదాపు 5 లక్షల కోట్లకు చేరుకుంటుంది. అప్పటికి మేజర్ పెట్టుబడులు పూర్తవుతాయి. పేదరికంపై యుద్ధం చేయడమే మిగులుతుంది. తెలంగాణలో పేదరిక నిర్మూలనకే భవిష్యత్తులో ఎక్కువ నిధులు ఖర్చు పెడతాం. పేదల విద్య, ఆరోగ్యంపై మరింత దృష్టి పెడతాం. కెజి టు పిజి విద్యావిధానంలో భాగంగా ఇప్పటికే గురుకుల విద్యాలయాలు ప్రారంభించాం. చదువుతోనే వికాసం అనే మాటను ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల సంఖ్య విపరీతంగా పెంచుతాం. ఆరోగ్య రంగంలో కూడా చాలా మార్పులు తెస్తాం. బిసి కులాల్లో పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇస్తాం. అందుకే పేదరిక నిర్మూలన సాధించేందుకు అవసరమైన సూచనలు చేయాలి.

ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మన విధానాలుండాలి. ఈ మొత్తం కార్యక్రమంలో బిసి కమిషన్ ముఖ్య పాత్ర పోషించాలి. ప్రజల బాధను పోగెట్టే విధానాల రూపకల్పనకు సూచనలు చేయాలి. చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయాలి. తెలంగాణ కొత్త రాష్ట్రం. ఇప్పుడు మంచి బాట వేయాలి. అది మంచి భవిష్యత్ నిర్మాణానికి ఉపయోగపడాలి” అని సి.ఎం చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్ , ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యానాయక్, శ్రీనివాసగౌడ్, టిఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

సిఎంను కలిసిన బాలమల్లు, వెంకటేశ్వర రెడ్డి

టిఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, తెలంగాణ న్పీర్ట్స్ అధారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

venkateshwar reddy

- Advertisement -