అందరికీ దళితబంధు పక్కా..!

123
kcr
- Advertisement -

తెలంగాణలో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధు పథకం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళితబంధు పథకంపై దుష్ప్రచారం చేస్తుండగా…సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కతో సహా కాంగ్రెస్ సీనియర్లు అంతా దళితబంధుకు జై కొడుతున్నారు. ముఖ్యంగా సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క దళితబంధు పథకం అమలు కోసం గట్టిగా పని చేస్తున్నారు. దళితబంధును స్వాగతిస్తే…కేసీఆర్‌కు జై కొట్టినట్లు అవుంఃతుందని, అది కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టమని రేవంత్ రెడ్డి అభ్యంతరం చెబుతున్నా…భట్టి మాత్రం పార్టీ రాజకీయ ప్రయోజనాల కంటే ..నా దళితజాతి అభ్యున్నతే ముఖ్యమంటూ రేవంత్‌ ముఖం మీదే కుండబద్ధలు కొట్టారు.

అంతే కాదు స్వయంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం, చింతకాని మండలంలో దళితబంధు అమలు బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. కాగా దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయరని, హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఆపేస్తారని, గ్రామాల్లో కొంత మందికి ఇచ్చినా…టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తారంటూ రేవంత్ రెడ్డి అండ్ కో చేసిన దుష్ప్రచారాన్ని భట్టి విక్రమార్క గట్టిగా తిప్పి కొట్టారు. తాజాగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం చిన్నమండవ, సీతంపేట, నాగులవంచ గ్రామాల్లోని దళితవాడల్లో భట్టి పర్యటించారు. ఈ సందర్భంగా బోనకల్‌లో మీడియాతో మాట్లాడుతూ…దళితబంధుపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. ఈ పథకంతో ఎస్సీల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయన్నారు. దళితబంధు పథకం పార్టీలకతీతంగా వర్తిస్తుందని, ఎవరి ప్రలోభాలకు గురికావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి దళితబంధు సాయం అందుతుందని ,, దళారులను నమ్మి మోసపోవద్దని దళితులకు సూచించారు. చింతకాని మండలంలో అర్హులందరికీ దళితబంధు దక్కేలా దగ్గరుండి జాబితాను తయారుచేసి అధికారులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. . లబ్ధిదారులకు తాము కోరుకున్న యూనిట్లు అందుతాయని తెలిపారు.. చింతకాని మండలంలోని దళిత కాలనీల్లో నెలకొ న్న సమస్యలను సీఎం కేసీఆర్‌కు వివరించానని, త్వరలో పరిష్కారం లభిస్తుందని భట్టి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే దళితబంధుపై కేసీఆర్‌కు అనుకూలంగా భట్టి విక్రమార్క వ్యవహరిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి బ్యాచ్ రగలిపోతుంది. దళితబంధుకు బ్రాండ్ అంబాసిడర్‌‌గా మారి ప్రచారం చేస్తున్న భట్టి విక్రమార్కపై కేసీఆర్ అనుకూల ముద్ర వేసి హైకమాండ్‌‌కు ఫిర్యాదు చేసే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా దళితబంధు పథకం అమలు కోసం పట్టుదల వదలని విక్రమార్కుడిలా పనిచేస్తున్న భట్టి విక్రమార్క తీరు కాంగ్రెస్ వర్గాలకు షాకింగ్‌గా మారింది.

- Advertisement -