నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ
చిత్రం 20 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకుంది. డిసెంబర్ 2న విడుదలై కరోనా సమయంలోనూ ఊహించని విజయాన్ని సాధించడం బాలకృష్ణలోని ప్రత్యేకతగా అభిమానులు తెలియజేస్తున్నారు. అందుకే వందరోజుల వేడుకను కర్నూలులో జరపాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. అఖండ వంద రోజుల కృతజ్ఞత సభ శనివారం రాత్రి కర్నూలు నగరంలోని ఎస్‌టి.బి.సి. కాలేజ్ లో ఘనంగా జరిగింది. ఆనందోత్సాహాలతో కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోనీ, విజయవాడ, ఢిల్లీ నుంచి సైతం పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. చిన్నపిల్లల నుంచి మహిళలు, పెద్దలు సైతం జైబాలయ్య
అంటూ నినదించారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ఇంతమంది జనాలమధ్య వందరోజుల వేడుక జరుపుకుని ఎన్ని సంవత్సరాలైందో. మేం ఈ సినిమాను ప్రారంభించినప్పుడు సింహా, లెజెండ్‌కు మించి వుండాలని మేం అనుకోలేదు. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులు జరగడం మరలా ఆగిపోవడం జరిగింది. విడుదలయ్యాక అఖండ విజయాన్ని ప్రేక్షకులు, అభిమానులు ఇచ్చారు. సినిమా అనేది అవసరంగా భావించారు. నాన్నగారి సినిమాలు ఆలోచించేవిగానూ, వినోదంగానూ వుండేవి. ఈ అఖండ సినిమా మన హైందవ సనాతన ధర్మాన్ని మరోసారి గుర్తుచేసేట్లుగా వుంది. ప్రకృతి, ధర్మం, ఆడవారి జోలికి వచ్చి ఎటువంటి అపాయం కలిగించినా భగవంతుడు ఏదో రూపంలో మనిషిలో ప్రవేశించి అవధూతగా మారతాడు. ఆ పాత్ర వేయించి నా ద్వారా దర్శకుడు సందేశం ఇచ్చాడు. అఖండ సినిమాను మన తెలుగువారే కాదు ప్రపంచంలోని అందరూ వేయినోళ్ళ తో పొగిడారు. మీ ద్వారా ఇంతటి అఖండ విజయాన్ని ఇచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. కృషివుంటే మనుషులు ఋషులవుతారంటారు. అలా దర్శకుడు బోయపాటి శ్రీను, నేను కథ మూలాల్లోకి వెళ్ళి మంచివి చేయాలని తపనతో కృషి చేస్తుంటాం. దర్శకుడు ఏ కథయినా కట్టె, కొట్టె, తెచ్చె అనే మూడు ముక్కల్లో చెబుతారు. బోయపాటి ఉన్నాడన్న ధైర్యంతో సినిమా చేస్తాను. ప్రతి నటుల్లోనూ హావభావాలు ఎలా రాబట్టాలో ఆయనకు బాగా తెలుసు. నేను కృత్రిమైన సినిమాలు భైరవదీపం, ఆదిత్య 369 చేశాను. కానీ అఖండ వంటి సహజమైన సినిమా చేసి అఖండ విజయాన్ని సాధించడం ప్రేక్షకుల అభిమానమే కారణం.
ఈ అఖండ సినిమా కోయిలకుంట్ల, ఆదోని, ఎమ్మిగనూరులో వందరోజులు ఆడింది. చిలకలూరిపేటలోనూ ఆడింది. ఇలా కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకోవడం పూర్వజన్మ సుకృతం. ఇక నా సినిమాలే నాకు పోటీ. సింహకు పోటీ లెజెండ్. లెజెండ్‌కు పోటీ అఖండ. ముందు ముందు మరిన్ని సినిమాలు మా నుంచి తయారువుతాయి. సినిమాను పరిశ్రమగా గుర్తించాలని ప్రభుత్వాలను గతంలో అడిగాం. ఇక నటన అంటే నవ్వు, ఏడవడం కాదు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అలా చేయించడంలో రచయితలు, దర్శకులు పని తనం వుంటుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అద్భుతంగా ఇచ్చారు. ప్రేక్షకుల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్ళాడు. శివతాండవం చేసేటప్పుడు థమన్ ఇచ్చిన ధ్వనితో అమెరికాలోని థియేటర్ల స్పీకర్‌లు బద్దలై సునామి సృష్టించాయి. కరోనా టైంలో చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాం. ఎప్పుడు కరోనా వచ్చిందనేది కూడా మర్చిపోయేలా చేయగలిగాం. అభిమానులు సినిమాలేకాదు. నాన్నగారి నుంచి సేవా కార్యక్రమాలను కూడా పుణికిపుచ్చుకుని చేస్తున్నారు. అందుకు గర్వంగా వుంది. బళ్ళారి బాలయ్య, ఒంగోలు అభిమానికి ఇలా ఎందరికో సాయం చేస్తున్నారు. అందుకు కృతజ్థతలు తెలియజేసుకుంటున్నా అని బాలయ్య తెలిపారు.