ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా రెండవ భాగం బాహుబలి: ది కన్‌క్లూజన్’ విజువల్ వండర్ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టిక్కెట్లు ఎప్పుడెప్పుడు దొరుకుతాయా.. అంటూ భాషలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా బాహుబలి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ఇంకో మూడు రోజులు కూడా సమయం లేదు. విడుదలకు సమయం దగ్గర పడేకొద్దీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది.
బాహుబలి అద్భుతాల్ని వెండితెర మీద చూసుకోవడానికి తహతహలాడిపోతున్నారు ప్రేక్షకులు. మామూలుగా ‘బాహుబలి’ని చూడటమే గొప్పగా అనిపిస్తే.. ఇక ఈ చిత్రాన్ని ఐమాక్స్ వెర్షన్లో చూస్తే ఇంకెంత గొప్పగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని సెలెక్టివ్ స్క్రీన్లలో ఈ సినిమాను ఐమాక్స్ వెర్షన్లలో ప్రదర్శించబోతున్నారు.
అయితే ఐమాక్స్ వెర్షన్లో చూస్తే దృశ్యం మరింత 20 శాతం కంటే ఎక్కువగా కనిపించడమే కాదు.. క్లారిటీ కూడా గొప్పగా ఉంటుంది. అది కచ్చితంగా ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని పంచేదే. ఇక ఇందుకోసం థియేటర్లు స్పెషల్‌గా ఎక్విప్ అయి ఉండాలి. ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా ‘బాహుబలి’నే కావడం విశేషం.
ఇదిలా ఉంటే ‘బాహుబలి: ది కంక్లూజన్’ తమిళం.. మలయాళ వెర్షన్లకు ఈ అవకాశం లేదు. కేవలం తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే ఐమాక్స్ వెర్షన్లలో రిలీజవుతోంది. కాబట్టి ఐమాక్స్ ఫార్మాట్లో చూసే అరుదైన అవకాశం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం అన్నమాట. మరి ఈ వెర్షన్ లో బాహుబలి2 ఆడియెన్స్‌కి ఎలాంటి అనుభూతిని పంచుతుందో చూడాలి.