ఏపీలో కేసీఆర్ వ్యాఖ్యల కలకలం

272
kcr
- Advertisement -

కెసిఆర్ వ్యాఖ్యలపై వైసిపిలో టెన్షన్
పక్కా సమాచారంతోనే కెసిఆర్ వ్యాఖ్యలు
నిప్పలేనిదే పొగ రాదంటూ చర్చలు
వైసిపీ ప్రభుత్వాన్ని బిజెపి కూలుస్తుందా..?
కేంద్రాన్ని ధిక్కరించలేదే…అయినా ఇదేమిటీ..?
రఘురామను కాపాడుతోంది అందుకేనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) కుట్రలు పన్నుతోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ముఖ్యమంత్రి కె.సి.ఆర్. చేసిన ఆరోపణలు వై.ఎస్.ఆర్.సి.పార్టీలో చర్చోపచర్చలకు దారితీశాయి. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడం మూలంగా బిజెపికున్న అనుకూలాంశాలు ఏమిటి?, కమలం పార్టీకి లాభమా? నష్టమా?, జగన్ ప్రభుత్వాన్ని కూలిస్తే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలపడుతుందా?, ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపికి సహకరించేందుకు వైఎస్ఆర్ సిపిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరు రెడీగా ఉన్నారు?, అక్రమాస్తుల కేసుల్లో జగన్ ను జైలుకు పంపడానికి ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయా ?7, జగన్ ను జైలుకు పంపించి వైఎస్ఆర్ సిపినీ-ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకునేందుకు బిజెపి ఏమైనా ప్రణాళికలు రచించిందా…? అనేటువంటి ప్రశ్నలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారంనాడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి.ఆర్.ఎస్.పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరతకు గురిచేసేందుకు బిజెపి ఢిల్లీ పెద్దలు చేసిన ప్రయత్నాలన్నింటినీ బట్టబయలు చేస్తూ… ఇంకా ఏయే రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బిజెపి కూల్చేందుకు ఏర్పాట్లు చేస్తోందో కూడా వివరించారు. తెలంగాణతో పాటుగా రాజస్థాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చేందుకు బిజెపి పెద్దలు అనేక కుట్రలు పన్నుతున్నారని, అందుకు ఒక్కో ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి 50 నుంచి 100 కోట్ల రూపాయల వరకూ ముడుపులు ముట్టజెప్పేందుకు కమలం పార్టీ ఏర్పాట్లు చేసుకొందని కెసిఆర్ చెప్పారని, మొత్తంగా 12 వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయబోతోందని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెను సంచలనం సృష్టించింది. అసలే డబ్బు కోసం ఎలాంటి కక్కుర్తి పనులకైనా తెగించే ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని, ముఖ్యమంత్రి జగన్ ఎలాగూ ఎమ్మెల్యేలను సంపాదించుకోనివ్వడం లేదని, ఒక్కసారిగా వంద కోట్లు వస్తున్నాయంటే చలా మంది ఎమ్మెల్యేలు కట్టగట్టుకొని వెళ్ళిపోతారని కూడా పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును బిజెపియే అన్ని విధాలుగా ఆదుకోవడమే కాకుండా కాపాడుతూనే ఉందని అంటున్నారు. అదీగాక ఎంపీలు సుజనా చౌదరి, సి.ఎం.రమేష్ లు ఏపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్ సి పార్టీ నేతలపైన అనేక ఫిర్యాదులు చేశారని, అమరావతి రాజధాని విషయంలో కూడా సీఎం జగన్ ఏకపక్షంగా వెళుతున్నాడని, పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అనేక అవి నీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని… పవర్ ప్రాజెక్టులు, ఓడరేవులు,జాతీయ రహదారుల నిర్మాణాల విషయంలోనూ ముఖ్యమంత్రి జగన్ బిజెపికి సహకరించడం లేదని, అంతా ఏకపక్షంగానే జరుగుతున్నాయనేటువంటి అనేక రకాల ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారని, అదీగాక ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులు కూడా సీఎం జగన్ పోకడలపై కూడా అనేక రకాల ఫిర్యాదులు చేశారని అంటున్నారు. దాంతో సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న బిజెపి పెద్దలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీ మారేటట్లుగా చేస్తే ఏపీలో బిజెపి బలపడుతుందని,రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా బిజెపి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలుంటాయని కూడా ఏపీ బిజెపి నాయకులు అధిష్టానానికి నివేదించారని, ఈ నేపధ్యంలోనే ఏపీలో కూడా ఆపరేషన్ ఆకర్షకు బిజెపి రంగంలోకి దిగవచ్చునని వైఎస్ఆర్ సిపి నాయకులు టెన్షన్ పడిపోతున్నారు.

అంతేగాక ముఖ్యమంత్రి జగన్ తనపైనున్న అక్రమాస్తుల కేసు నుంచి బయటపడేందుకే కేంద్రంలోని బిజెపి పెద్దలతో సఖ్యతతో, సయోధ్యగా ఉన్నట్లుగా నటిస్తున్నారేగానీ వాస్తవానికి ఎపీ సీఎం వల్ల కమలం పార్టీకి ఒరిగిందేమీ లేదని, సీఎం జగనే బిజెపిని వాడుకొంటున్నట్లుగా ఉందేగానీ, బిజెపి జగన్ ను వాడుకోవడం లేదనే వాదనను కమలం పార్టీ నేతలు తెరపైకి తెచ్చారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న ఏపీ బిజెపి నాయకులు సుజనా చౌదరి, సీ.ఎం.రమేష్, సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణ తదితర సీనియర్ నాయకులు ఆపరేషన్ ఆకర్షను సమర్ధవంతంగా అమలు చేయగలిగిన దిట్టలేనని, వారికి అండగా వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజు ఉండనే ఉన్నాడని… అందుచేతనే ఏపీలో ఏమైనా జరగవచ్చునని కూడా ఆ నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్ జైలుకెళితే పార్టీ ముక్కలు చెక్కలవుతుందని, ఆ తర్వాత బిజెపి ఆపరేషన్ ఆకర్షను చేపడితే విజయవంతమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఈ పరిణామాలన్నింటిపైనా చాలా స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అని, అందుకే ఆయన ఏపీలో కూడా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్రలు పన్నుతుందని చెప్పి ఉంటారని చర్చించుకొంటున్నారు. బిజెపి పెద్దలు గనక ఏపీని హస్తగతం చేసుకోవాలని నిర్ణయించుకొంటే ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతుందని, అందుకే టెన్షన్ పడుతున్నామని పలువురు వైసిపి నేతలు వివరించారు. అన్నింటికీ డబ్బే ప్రధానం కాబట్టి ఎమ్మెల్యేలు ఆవురావురంటున్నారని, చేతులు ముడుపుచుకొని కూర్చున్న వారికి ఒక్కసారిగా వంద కోట్లు వస్తున్నాయంటే ఎవ్వరూ తిరస్కరించరని, కేబినేట్లోని కొందరు మంత్రులు కూడా పార్టీ మారేందుకు కూడా వెనుకాడరని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్రమైన చర్చకు దారితీశాయి.

ఇవి కూడా చదవండి..

కొరివితో తలగోక్కున్న బిజెపి

బండికి అధిష్టానం అక్షింతలు..

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

- Advertisement -