తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తితో ఉంది. నాయకత్వంలోను, పార్టీ సమర్థతలోను టీఆర్ఎస్ కు పోటీగా నిలబడగలిగే ప్రత్యామ్నాయం ప్రస్తుతం లేదనే చెప్పాలి. అదే సమయంలో టీఆర్ఎస్ పాలన పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే పక్క రాష్ట్రం ఆంధ్రాతో పోలిస్తే టీఆర్ఎస్ పాలన మెరుగ్గానే ఉందనేది మరికొందరి వాదన. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ లోను కేసీఆర్, కేటీఆర్ అంటే ప్రత్యేకమైన ఆసక్తి కనబరిచేవారు ఈమధ్య రోజుల్లో ఎక్కువయ్యారు. అడపాదడపా అక్కడక్కడ వీరి ఫ్లెక్సీలు ఏపీలో దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇదే విషయంపై గతంలో కేటీఆర్ ఓ సరదా వ్యాఖ్య కూడా చేశారు. ఒకవేళ టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తే.. భీమవరం నుంచి పోటీ చేస్తుందని, కోళ్ల పందేలకు అనుమతులిస్తే చాలు.. అక్కడి ప్రజలు తమకే పట్టం కడుతారని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రం సాధించడంలో విజయం సాధించిన కేసీఆర్ పాలన పై ఏపీలో మంచి అభిప్రాయం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్‌ఎస్ పార్టీని విస్తరించాలనే డిమాండ్ ఊపందుకుంటున్నది. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈమెయిల్‌లు, ఎస్సెమ్మెస్‌లు, లేఖలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేయగలిగే ఏకైక నాయకుడు మీరే. సమస్యలను అర్థం చేసుకోవడంలో, వాటిని పరిష్కరించడంలో మీ పంథా అనుసరణీయం. సంక్షేమం, అభివృద్ధిని మేళవించి సమర్థంగా పాలన చేస్తున్నారు. తెలుగు ప్రజలందరూ మిమ్మల్ని కొనియాడుతున్నారు. మీలాంటి సమర్థ నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగువాళ్లకు కూడా కావాలి. మీ పార్టీ(టీఆర్‌ఎస్)ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించండి. లేదా ప్రారంభించుకోవడానికి ఆంధ్రాలో పార్టీ పెట్టండి మాకు అనుమతి ఇవ్వండి అని లేఖల్లో వారు కోరుతున్నారు.
ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చేసిన నిరాధార ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరుపై ఆంధ్రప్రదేశ్‌లో విస్త్రుత చర్చ జరిగింది. టీవీల్లో ఆ కార్యక్రమాన్ని ఆంధ్రా ప్రాంతం ప్రజలు ఆసక్తిగా తిలకించారు. నాయకుడంటే ఇలా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనలు పెట్టారు. ఇదే అంశంమీద ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈమెయిళ్లు, లేఖల రూపంలో స్పందన పంపారు. గత మూడేండ్లుగా తెలంగాణలో పరిపాలన తీరు తెన్నులను, ఇక్కడ చేపట్టిన వివిధ పథకాలను అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ప్రశంసించిన విషయం తెల్సిందే. ఇలా అభినందించిన వారిలో ఆంధ్రప్రదేశ్ నాయకులు, ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.