చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. సీడీఎస్ గా ఈయన రెండవ వ్యక్తిగా నిలిచారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో నియమితులైన అనిల్ చౌహాన్.. కేంద్ర ప్రభుత్వానికి మిలిటరీ విభాగం సలహాదారుగా కూడా సేవలందిస్తారు. దాదాపుగా తొమ్మిది నెలల తర్వాత పూర్తి స్థాయిలో బిపిన్ రావత్ మరణంతో అనిల్ చౌహాన్ నియమితులయ్యారు.
సీడీఎస్ పదవి కోసం ప్రస్తుతం ఉన్న మాజీ వివిధ ఉన్నతాధికారుల పేర్లను పరిశీలించిన కేంద్రం ఎట్టకేలకు అనిల్‌ను నియమించింది. దాదాపు 40 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో ఇండియన్ ఆర్మీలో పనిచేసిన ఆనుభవం ఉంది. సైన్యంలో అతని విశిష్టమైన సేవలకు గుర్తింపుగా పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేన పతకం, విశిష్ట సేవా పతకాలను అందుకున్నారు.
జమ్ము కశ్మీర్‌తో పాటు ఆగ్నేయ భారతదేశంలో కౌంటర్ ఇన్‌సర్జెన్సీలో ఆపరేషన్స్ చేపట్టడంలో అనిల్ చౌహాన్ నేర్పరిగా పేరు గడించారు. ఆపరేషన్ సన్‌రైజ్ కార్యక్రమానికి రూపకల్పన చేసిన అనిల్ చౌహాన్.. భారత-మయన్మార్ సరిహద్దు సమీపంలో తిరుగుబాటు గ్రూపులకు వ్యతిరేకంగా ఇరుదేశాల సైన్యం సమన్వయ కార్యకలాపాలు కొనసాగించేలా చేయగలిగారు. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రణాళికలో కూడా ఆయన పాల్గొన్నారు.
అనిల్ చౌహాన్ సెప్టెంబరు 2019 నుంచి తూర్పు కమాండ్‌కి జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 మే 31 న పదవీ విరమణ చేసే వరకు ఇదే బాధ్యతలో కొనసాగారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌తో సహా ముఖ్యమైన సిబ్బంది నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరించారు. అంగోలాకు ఐక్యరాజ్యసమితి మిషన్‌గా కూడా పనిచేశారు.