ఏపీలో బిఆర్‌ఎస్ పార్టీ రోజు రోజుకు బలం పెంచుకుంటోంది. పక్కా రాష్ట్రం కావడం అందులోనూ తెలుగు రాష్ట్రం కావడంతో ఆంధ్రప్రదేశ్ లో బిఆర్‌ఎస్ ఊహించిన దాని కంటే వేగంగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిఆర్‌ఎస్ ను జాతీయ పార్టీగా కేసిఆర్ ప్రకటించినప్పుడు ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతించారు. ఎందుకంటే తెలంగాణలో కేసిఆర్ చేస్తున్న పరిపాలన ఏపీ ప్రజలను గట్టిగానే ఆకర్షించిందనే చెప్పాలి. అభివృద్దిలోనూ, సంక్షేమంలోనూ ఏపీలో పోలిచితే తెలంగాణ ముందు వరుసలో ఉంది. అందుకే కేసిఆర్ పాలనను ఏపీ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బిఆర్‌ఎస్ కార్యక్రమాలు చేపట్టిన ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
దాంతో రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఏపీలో క్రియాశీలకంగా మారబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ బిఆర్‌ఎస్ పోటీ చేస్తుందని ఏపీ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉండడంతో పార్టీని క్షేత్ర స్థాయిలో విస్తరించేందుకు బిఆర్‌ఎస్ అధిష్టానం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇటీవల బిఆర్‌ఎస్ అధికారిక పార్టీ కార్యాలయాన్ని కూడా ఏపీ ప్రారంభించారు.
Also Read: అవినాష్ రెడ్డి వెంటే.. సిబిఐ !
ఈ నేపథ్యంలో రాష్ట్ర బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాయని రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలకు బిఆర్‌ఎస్ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరిపాలన నచ్చక జగన్ కు ఓటేశారని, ఇప్పుడు జగన్ కూడా ప్రజాగ్రహానికి లోనవుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అవినీతిలో కూరుకుపోయిందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ లకు ప్రత్యామ్నాయంగా బిఆర్‌ఎస్ నిలుస్తుందని తోట చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
Also Read: ‘మీటింగ్ టైమ్’ బీజేపీలో కలవరం పోతుందా?