జమ్మూ కశ్మీర్‌లోని శాంతి భద్రతలపై శుక్రవారం కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, రా ఛీప్, ఆర్మీ చీఫ్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కశ్మీర్‌లో జరుగుతున్న ఘటనలను తక్షణమే అణచివేసేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ తరహా ఘటనలు జరగడానికి అసలు కారణాలేమిటన్న దిశగానూ ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక గతకొద్ది రోజులుగా కశ్మీర్‌లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఓ వైపు ఉగ్రవాదుల దాడులు పెరిగిపోగా… మరోవైపు రోజుకో హిందువు హత్యకు గురవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న కశ్మీర్‌లో ఈ పరిస్థితులకు కారణం కేంద్ర ప్రభుత్వమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాలతో పాటు సోంత పార్టీలో నుంచి కూడా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపైకి విమర్శలు ఎదురౌతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అమిత్ షా ఈరోజు ఈ కీలక భేటీని నిర్వహించారు.