గుజరాత్ ఎన్నికల్లో కొంత మేరకు విఫలమైనా మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా సామాన్యుడిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయనుంది. ముఖ్యంగా గ్రామీణ రైతు కూలీలను ఆకట్టుకునే విధంగా ఈ బడ్జెట్ ను రూపొందిస్తున్నారు. ఆర్ధిక సంస్కరణలను కొనసాగిస్తూనే సామాన్యున్ని అక్కున చేర్చుకునే విధంగా అరుణ్ జైట్లీ బడ్జెట్ ను తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఇది ఆఖరు బడ్జెట్ అని చెప్పవచ్చు.
2019లో ఎన్నికలు జరుగనున్న కారణంగా కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మాత్రమే ప్రతిపాదిస్తారు. అంటే ఇది ఎన్నికల బడ్జెట్ అన్నమాట. ముఖ్యంగా రైతులను ప్రోత్సహించి వారి ఆదాయాన్ని పెంచే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలు జరుగనున్నాయి. అదే విధంగా అందరికి ఓ ఇల్లు ఏర్పాటు చేయాలన్నది మోడీ ప్రభుత్వ లక్ష్యం . అదే విధంగా ఉద్యోగ కల్పన కోసం కూడా తగు ప్రతిపాదనలు చేస్తారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను, చిన్న చిన్న వ్యాపారులకు మేలు కలిగేలా తాయిలాలను జైట్లీ తీసుకు వస్తారని అంచనా వేస్తున్నారు. గడచిన రెండు సంవత్సరాలతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు పెరిగినట్టు సంకేతాలు కనిపిస్తున్నా, పంట దిగుబడి తగ్గడం, లక్షలాది మంది యువత నిరుద్యోగులుగా మిగులుతుండటం, జీఎస్టీపై ఇంకా పూర్తి అవగాహన పెరగక పోవడం, నోట్ల రద్దు తరువాత ఏర్పడిన పరిణామాలు మోడీ సర్కారుకు అడ్డంకులుగానే భావించవచ్చు.
ఇక ఈ బడ్జెట్ లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేలా అరుణ్ జైట్లీ పలు కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కావడంతో పంటల బీమా, గ్రామాల్లో గృహ నిర్మాణాలకు పెద్ద పీట వేయవచ్చని సమాచారం.
త్రాగు, సాగు నీరుతో పాటు రవాణా సౌకర్యాలను మెరుగు చేసే దిశగా బడ్జెట్ రూపొందిస్తున్నారు. విద్యా, వైద్యరంగానికి సంబంధించి కూడా ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తమ్మీద బడ్జెట్ ను జనరంజకంగా చేసి అందరి మన్ననలు పొంది అన్ని వర్గాల వారిని ఆకర్షించి మరోమారు అధికారం కైవసం చేసుకోవాలన్నది మోడీ ప్రభుత్వ లక్ష్యం.అటు మరోవైపు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్థిక వృద్ధి మందగమనం వంటి అంశాలను విపక్షాలు అస్త్రాలుగా మలచుకోనున్నాయి. మొత్తానికి ఆఖరి బడ్జెట్ సమావేశాలు వాడీ వేడీగా సాగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.