ఆగస్టు 24వ తేదీ నుంచి రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి రానుంది.. ఇప్పటివరకు ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ఈ ఫోన్లు అందనున్నాయి. ఆ ఫోన్ ధర రూ.0 అని మాత్రమే నిర్దారణ అయింది. ఇందుకు రూ.1500లను సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోనున్నారు. అయితే 3 ఏళ్ల తరువాత ఆ మొత్తాన్ని కూడా తిరిగి ఇస్తామని ప్రకటించడంతో మార్కెట్లో ఇతర టెలికాం కంపెనీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.. అయితే జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమైన ఎయిర్‌టెల్.. 4జీ వోల్టే సర్వీసులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం మొబైల్ ఉత్పత్తి తయారీ కంపెనీలతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. తద్వారా 4జీ వోల్టే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి జియోకు చెక్ పెట్టాలని భావిస్తోంది.
జియో ఉచిత ఫీచర్ ఫోన్ కు పోటీగా రూ. 2,500 ధరలో ఎయిర్ టెల్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. దీని కోసం మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలతో ఎయిర్ టెల్ జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. జియో ఫీచర్ ఫోన్ తో పోలిస్తే మెరుగైన స్క్రీన్, మంచి కెమెరా, అధిక బ్యాటరీ సామర్థ్యం దీనికి ఉంటాయని టెలికం ఇండస్ట్రీ నిపుణులు వ్యాఖ్యానించారు. అధిక మొత్తంలో డేటాతో పాటు వాయిస్ మినిట్స్ ఇస్తూ, ఈ ఫోన్ ను ఫీచర్ ఫోన్ తో పోలిస్తే మెరుగైన ఆప్షన్లతో తీసుకువస్తున్నట్టు ఎయిర్ టెల్ వర్గాలు వెల్లడించాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు అన్ని రకాల యాప్స్ నూ వాడుకోదగ్గ ఈ ఫోన్ దసరా, దీపావళి పండగ సీజన్ లో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.
కాగా, ఎయిర్ టెల్ తమతో చర్చలు జరిపిన మాట వాస్తవమేనని లావా, కార్బన్ సంస్థలు ప్రకటించాయి. అయితే, డీల్ కుదిరిందా? లేదా? అన్న విషయాన్ని మాత్రం ఈ కంపెనీలు వెల్లడించలేదు. జియోతో పోటీని ఎదుర్కోవాలంటే, అదే వ్యూహం తప్పదని భావిస్తున్న ఎయిర్ టెల్ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టు టెలికం వర్గాల సమాచారం. అయితే, రిలయన్స్ మాదిరిగా ఈ మొత్తాన్ని కొన్నాళ్ల తరువాత తిరిగి ఇస్తారా? లేదా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఇక తమ కొత్త స్మార్ట్ ఫోన్ విషయమై ఎయిర్ టెల్ అధికారికంగా స్పందించాల్సి వుంది.