సుందర్.సి దర్శకత్వంలో ఆర్య, జయం రవి తదితరులతో ‘సంఘమిత్ర’ రూపొందనున్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సుందర్ సీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లీడ్ క్యారెక్టర్ శృతిహాసన్ తప్పుకోవడం దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
ఏకంగా సినిమాకు వెన్నముక లాంటి సంఘమిత్ర పాత్రధారి శృతిహాసన్ తప్పుకోవడం ద్వారా ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా అనే సందేహం వ్యక్తమవుతున్నది. ఈ చిత్రం కోసం కత్తిసాము, గుర్రపు స్వారీ లాంటి విద్యలను నేర్చుకొన్నది. ఇలా అనేక రకాలుగా చొరవ తీసుకొన్న శృతి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది.
దీంతో ఇప్పుడు ఆమె పాత్రలో ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి కోలీవుడ్ వర్గాల్లో నెలకొంది. శృతిహాసన్ తప్పుకోవడం ద్వారా సంఘమిత్ర చిత్రంలోకి అనుష్క ఎంట్రీ క్లియర్ అయినట్టు కోలీవుడ్ కోడై కూస్తున్నది. సంఘమిత్రలో అనుష్క చేరితే ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ వస్తుందనే మాట వినిపిస్తున్నది. అయితే బాహుబలి తర్వాత పిరియాడిక్ ఫిలిం ప్రమాణాలు బాగా పెరిగాయి. దానిని దృష్టిలో పెట్టుకొని ఇతర పాత్రధారుల్లో అనూహ్య మార్పులు జరిగే అవకాశం కూడా ఉందనే మాట వినిపిస్తున్నది.
ఈ నేపథ్యంలో ‘సంఘమిత్ర’ చిత్రంలో నటించాలనుందని హీరోయిన్ నీతు చంద్ర వెల్లడించారు. సంఘమిత్ర పాత్రలో నటించడానికి అంకితభావం, ఆనందం, ఆసక్తితో ఉన్నానని తెలిపారు. నర్తకి, వీరనారి సంఘమిత్ర పాత్రలో నటించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది.మరి భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంఘమిత్రలో నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో వేచిచూడాలి.