జయరాం హత్యకేసులో ‘ఆ నలుగురు’ నటుడు..!

219
jayaram
- Advertisement -

సంచలనం రేపిన ఎన్నారై,పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన రాకేశ్ రెడ్డి,శ్రీనివాస్‌లను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు కీలకసమాచారాన్ని రాబట్టారు.

జయరాంను హత్యచేసిన అనంతరం 5 గంటలపాటు తన కారులోనే ఉంచుకుని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తిరిగినట్లు రాకేశ్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని నందిగామ తరలించే వరకు ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు, నల్లకుంట ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో 13 సార్లు రాకేష్‌రెడ్డి మాట్లాడినట్లు తెలిపారు.

ఈ కేసులో ఇప్పటి వరకు 30మందిని విచారించినట్టు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే శిఖా చౌదరిని కూడా విచారిస్తామన్నారు డీసీపీ. ఈ హత్య కేసులో ‘ఆ నలుగురు’ నటుడు డుంబు అలియాస్ సూర్య ప్రసాద్‌  పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

జయరాంను హత్య చేసిన అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మల్లారెడ్డి, శ్రీనివాస్‌ సలహాలు తీసుకున్నాని రాకేశ్‌ రెడ్డి తెలిపారు. హత్య చేసిన తర్వాత గోవాకు వెళ్లానని, ఈ నెల 3న శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసినట్లు విచారణలో వెల్లడించారు రాకేశ్‌ రెడ్డి.

శిఖాతో పరిచయమయ్యాక జయరాంకు 2016లో రూ.2.25 కోట్లు, 2017లో రూ.1.12 కోట్లు, 2018లో రూ.80 లక్షలు అప్పుగా ఇచ్చినట్టు రాకేశ్‌ ‌రెడ్డి పోలీసులకు వివరించాడు. అప్పు తీర్చలేని పక్షంలో జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబరు 44లో ఉన్న తన నివాస భవనాన్ని ఇస్తానని జయరాం చెప్పినట్టు అతను పోలీసులకు తెలిపాడు. కొత్త ఫోన్‌ నంబర్‌తో వీణ అనే యువతి పేరిట వాట్సప్‌ ద్వారా చాటింగ్ చేసి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి రప్పించినట్లు వెల్లడించారు.

- Advertisement -