తొలిసారిగా అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్. ఆ సినిమా పేరే ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ . అమీర్-అమితాబ్ ఒకే సినిమాలో కనబడనున్నారనే వార్త వినగానే సినీ ప్రేమికులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపించడం అమీర్ ఖాన్‌కు కొత్తేమీకాదు. అయితే ఈ సినిమాలో కూడా అమీర్ ఖాన్ డిఫెరెంట్ గెటప్ లో కనిపించనున్నాడట.
గత ఏడాది రిలీజైన ‘దంగల్’ కోసం అమీర్ ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా అమీర్ పాత్రకు తగ్గట్టు డిఫెరెంట్ లుక్‌లో కనిపించడానికి సన్నాహాలు మొదలుపెట్టేసినట్లున్నాడు. ఈ చిత్రం కోసం అమీర్ ఖాన్ గడ్డం పెంచాడు. అంతేకాదు ఈ గడ్డానికి తోడు నెత్తి మీద తలపాగా పెట్టేసి ఒక ఫొటో షూట్ కూడా చేశాడు. దీన్ని బట్టి ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో అమీర్ సిక్కు పాత్ర పోషిస్తున్నాడని తెలిసిపోతుంది.
‘ధూమ్-3’ చిత్ర దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రం ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కుతుందట. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మరోవైపు అమీర్ ఖాన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ఈ ఏడాది ఆగస్టులో విడుదలవుతుంది. మొత్తానికి ఈ కొత్త పాత్రలో కూడా అమీర్ ఖాన్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.