క్రీడాకారులకు ప్రధానంగా క్రికెటర్లకు అభిమానులే బలం. తమను పిచ్చిఅభిమానంతో ఆరాధించే అభిమానులను అలరించడం కోసమే క్రికెటర్లు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అదే అభిమానం హద్దులు మీరి ఇబ్బందిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా అభిమానులు తమ అభిమాన క్రికెటర్ దగ్గరికి వచ్చి పాదాభివందనం చేస్తారు.. లేదంటే సెల్ఫీలు తీసుకుంటారు అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారింది. క్రికెటర్ల కోసం అభిమానులు మైదానంలోకి కౌగిలింతలకు, లేదంటే ముద్దులు పెట్టడానికి వస్తున్నారనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.
తాజాగా అభిమానులు క్రికెటర్లకు ముద్దులు పెట్టడానికి మైదానంలోకి వచ్చిన ఘటనలు రెండు జరిగాయి. చిత్రమేమిటంటే ఆ రెండు మన ఇండియన్ క్రికెటర్లకు సంబంధించినవే. అందులో ఒకటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిది కాగా మరొకరి టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మది. తమ ఆరాధ్య క్రికెటర్లపై ఉన్న భద్రతా ఏర్పాట్లను తప్పించుకుని మరీ మైదానంలోకి వచ్చి ముద్దులిచ్చి మరీ వెళ్లారు ఆ అభిమానులు. ఉప్పల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండోటెస్ట్‌లో కోహ్లీని ఓ అభిమాని ముద్దు పెట్టుకోవడం ఘటన మరువకముందే ..రోహిత్శర్మకూ ఇదే అనుభవం ఎదురైంది.
విజయ్‌హజారే ట్రోఫీలో భాగంగా బీహార్‌తో క్వార్టర్స్ మ్యాచ్‌లో రోహిత్ బ్యాటింగ్ చేస్తుండగా అభిమాని పిచ్వరకు పరుగెత్తుకొచ్చాడు. తొలుత రోహిత్‌కు పాదాభివందనం చేసి అనంతరం హగ్ చేసుకుని హెల్మెట్ మీద ముద్దు పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ అభిమాని రోహిత్ కు పాదాభివందనం చేసి చెంగున గెంతులు వేస్తూ వేగంగా బయటకు వెళ్లాడు. ఇప్పుడు రోహిత్‌కు అభిమాని ముద్దుపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.