మనిషిలో డిప్రెషన్ చాలా ప్రమాదకరమైన జాఢ్యం. ఈ విషయాన్ని తాజాగా మరో అధ్యయనం తేల్చిచెప్పింది. అందులోనూ టీనేజ్ కుర్రాళ్లలో డిప్రెషన్ అధికంగా ఉంటే అది హింసకు కూడా దారితీస్తుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ (బ్రిటన్)కు చెందిన ఫొరెన్సిక్ సైకియాట్రిక్ గ్రూప్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.
నెదర్లాండ్స్, బ్రిటన్, ఫిన్లాండ్‌లకు చెందిన వందలాది మంది యువకుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి ఈ నిర్ధారణకు వచ్చారు.
డిప్రెషన్ కలిగివున్న కుర్రాళ్లు ఆయా దేశాల్లో జరిగే హింసాత్మక ఘటనల్లో ఎక్కువగా పాల్గొన్నారని, అలాగే ఈ తరహా యువకులు వ్యక్తిగతంగా కూడా తీవ్రమైన హింసకు పాల్పడతారని ఈ అధ్యయనం పేర్కొంది. గృహహింసకు కూడా డిప్రెషన్ ఒక కారణమని తెలిపింది. డిప్రెషన్ కలిగివున్న 7.1 శాతం ఫిన్లాండ్ యువకులు ఒకటి అంతకుమించి నేరాలకు పాల్పడి జైలుశిక్ష అనుభవిస్తున్నారని పేర్కొంది.
బ్రిటన్‌లో 8 శాతం మంది, నెదర్లాండ్స్‌లో 7 శాతం మంది ఈ తరహా నేరాలకు పాల్పడ్డారని తెలిపింది. ఇండియాలో వివిధ రకాల హింసకు పాల్పడిన వారిలో కూడా డిప్రెషన్ ప్రధాన కారణమని వెల్లడించింది. డిప్రెషన్ ఉన్నవారిలోనే హింసాత్మక ధోరణి ఎక్కువని స్పష్టంచేసింది.