కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జిఎస్టీ విధానం వల్ల పలు వ్యాపారాలకు నష్టం వాటిల్లుతోందని, వెంటనే జీఎస్టీ విధానంలో వెసులుబాటు కల్పించాలని ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదే క్రమంలో వస్త్ర పరిశ్రమను జి.ఎస్.టి. నుంచి మినహాయించేలా చర్యలు తీసుకోవాలని వస్త్ర పరిశ్రమకు చెందిన సంఘాలు కోరుతున్నాయి.
ఇందుకోసం వస్త్ర పరిశ్రమకు చెందిన సంఘాలు అనేక మంది పేద, మధ్యతరగతి ప్రజలు ఆధారపడిన వస్త్ర పరిశ్రమను జి.ఎస్.టి. నుంచి మినహాయించేలా కేంద్రంపై వత్తిడి తేవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరాయి.
వస్త్ర సంఘాల ప్రతినిధులు హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వస్త్ర పరిశ్రమకు, వస్త్ర వ్యాపారానికి గతంలో పన్ను నుంచి మినహాయింపు ఉండేదని, కానీ జిఎస్టీలో 5 శాతం పన్ను విధించారని వివరించారు. ఇది వస్త్ర వ్యాపారానికి ఇబ్బందికరంగా మారిందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని కేంద్రానికి విన్నవించాలని సీఎంను కోరారు.
వస్త్ర వ్యాపారంపై పన్ను మినహాయింపు ఉండాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి విన్నవిస్తానని మాటిచ్చారు. వస్త్ర పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ, మంచినీరు-సాగునీటి పథకాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, బీడీ పరిశ్రమ తదితర అంశాలను జిఎస్టీ నుంచి మినహాయించాలని తాము ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్ టైల్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు ప్రకాశ్ అమ్మనబోలు, ఉపాధ్యక్షుడు సంతోష్ చౌకాని, సంయుక్త కార్యదర్శి సంగమేశ్వర్, కోశాధికారి ఈశ్వర్ అప్పర్, సికింద్రాబాద్ కట్ పీస్ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు భగత్ రాం గుప్త, ప్రధాన కార్యదర్శి చీరె శ్రీకాంత్, హైదరాబాద్ కట్ పీస్ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ అగర్వాల్, మదీనా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
కాగా వస్త్ర పరిశ్రమకు చెందిన సంఘాల విజ్ఞప్తిని తప్పక పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని సీఎం వెల్లడించారు. తదుపరి జిఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటారని తాను విశ్వసిస్తున్నట్లు సీఎం చెప్పారు.