ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న ఐపీఎల్ 18వ మ్యాచ్ లో కోల్ కతా ఘనవిజయం సాధించింది. ఢిల్లీ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కొల్పోయి చేధించింది. తొలుత మూడు ఓవర్లకే 5 పరుగుల వద్ద గ్రాండ్‌హోమ్ (1), 19 వద్ద ఉతప్ప (4), 21 వద్ద గౌతమ్ గంభీర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గెలుపు ఆశలు సంక్లిష్టం అనుకున్న తరుణంలో మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్ జట్టుకు అండగా నిలిచారు. తొలుత నెమ్మదిగా ఆడిన ఈ జంట తర్వాత బౌండరీలు, సిక్సర్లతో విరుచుకపడ్డారు.
కొంతకాలంగా ఫామ్‌లో లేక ఇబ్బంది పడ్డ పఠాన్ ఈ మ్యాచ్‌తో మరోసారి తన సత్తాచాటాడు. పాత యూసుఫ్ పఠాన్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లకు రుచిచూపిస్తూ, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 35 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతనికి జతగా మనీష్ పాండే హఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ కష్టాల నుంచి గట్టెక్కింది.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఓపెనర్లు సంజూ శాంసన్ (39), శామ్ బిల్లింగ్స్ (21) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరి దూకుడుతో కేవలం 6 ఓవర్లకే తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం లభించింది. అనంతరం కరుణ్ నాయర్ (21) తొలిసారి ఫర్వాలేదనిపించగా, శ్రేయస్ అయ్యర్ (26) ఆకట్టుకున్నాడు. అనంతరం భవిష్యత్ టీమిండియా కీపర్ గా వెటరన్ ల ప్రశంసలందుకుంటున్న రిషబ్ పంత్ (38) ధాటిగా ఆడాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో ఆకట్టుకున్నాడు.
టీమిండియా స్పీడ్ స్టర్ ఉమేశ్ యాదవ్ వేసిన 17వ ఓవర్ లో 0, 6, 4, 6, 6, 4 లతో 26 పరుగులు పిండుకోవడం విశేషం. అనంతరం చివర్లో క్రిస్ మోరిస్ (16) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.