ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి ఆన్ లైన్ లోనూ బోనాలు సమర్పించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసిందని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం అరణ్య భవన్లో ఉజ్జయినీ మహంకాళీ, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనం సమర్పించేందుకు ఆన్ లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆన్ లైన్ బుక్ చేసుకుంటే.. ఆలయ నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారని, గోత్రనామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తారన్నారు. ఆ తర్వాత పోస్టు ద్వారా బోనంలోని బియ్యం ప్రసాదంలా పంపిణీ చేస్తారని, వాటిని ఇంటి వద్దే వండుకొని ప్రసాదంలా స్వీకరించవచ్చన్నారు. బియ్యంతో పాటు బెల్లం, అక్షింతలు, పసుపు-కుంకుమ పంపిస్తారని చెప్పారు.
ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి ఆన్ లైన్లో బోనం సమర్పించే భక్తులకు జూలై 4 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. TAPP FOLIO, మీ సేవ, ఆలయ వెబ్ సైట్, పోస్ట్ ఆఫీస్ ద్వారా దేశ, విదేశీ భక్తులు ఈ సేవలను బుక్ చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. దేశీయ సేవలకు గానూ రూ. 300, అంతర్జాతీయ సేవలకు గానూ రూ. 1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటిని పోస్ట్ ఆఫీస్, ఆర్టీసీ కొరియర్ సేవల ద్వారా దేశీయ భక్తుల ఇంటికి చేరవేస్తారని మంత్రి ఐకే రెడ్డి వెల్లడించారు.
ఆన్ లైన్లో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ సేవలు..
హైదరాబాద్లో ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఆన్ లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జులై 5న వైభవంగా నిర్వహించనున్నారని, జూలై 4 లోగా భక్తులు ఆన్ లైన్ కళ్యాణం సేవలను బుక్ చేసువాలని తెలిపారు. అమ్మవారి కళ్యాణం సందర్భంగా ఆన్ లైన్ సేవలు బుక్ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, పసుపు కుంకుమ, మిస్రి, ఇతర డ్రై పూట్స్ ఇంటికి పంపిస్తారని చెప్పారు. TAPP FOLIO, మీ సేవ, ఆలయ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ కళ్యాణ సేవలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పోస్ట్ మాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ డా.పీ.వీ.ఎస్ రెడ్డి, డిప్యూటీ కమిషర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మహంకాళీ ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, బల్కంపేట ఆలయ ఈవో అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.