కేంద్ర మంత్రిని కలిసిన మంత్రులు కేటీఆర్, గంగుల

174
- Advertisement -

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌లు కేంద్ర ఇండస్ట్రీ అండ్ కామర్స్, టెక్స్ టైల్స్ మరియు ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి పియూష్ గోయల్‌ను బుధవారం కలిశారు. తమ తమ శాఖల పరిధిలో తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల రాష్ట్రానికి సంబందించిన సివిల్ సప్లైస్, పాడీ ప్రొక్యూర్మెంట్ పలు అంశాలను కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లి విజ్ణాపన పత్రాల్ని అందజేశారు.

సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన రైతు అనుకూల విధానాలతో ఇప్పుడిప్పుడే తెరపిన పడుతున్న తెలంగాణ రైతాంగానికి అండగా ఉండాల్సిన భాద్యత కేంద్రంపై ఉందన్నారు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఈ రోజు బుదవారం రాత్రి కేంద్ర ఆహార మరియు ప్రజాపంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కలిసి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై మంత్రి గంగుల కమలాకర్ వివరించారు, గతానికి భిన్నంగా కొత్తగా ఉత్పన్నమైన మూడు ప్రధాన సమస్యలైన ఈ యాసంగిలో పారాబాయిల్డ్ రైస్ 50లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్.సి.ఐ తీసుకోవాల్సిన ఆవశ్యకత, గతంలో 2019-20 రబీలో నష్టపోయిన ముప్పై రోజుల్ని భర్తీ చేసి మిగిలిన బియ్యాన్ని అందించడానికి మరో ముప్పై రోజుల గడువుని పెంచాల్సిందిగా కొరడం, రాబోయే వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఇచ్చిన హామీకు కట్టుబడి ఉండాలని కేంద్రమంత్రిని కోరారు గంగుల.

రైతుబంధు, 24 గంటల కరెంటు, కాళేశ్వర జలాలతో రికార్డు స్థాయిలో ఈ ధపా రాష్ట్రంలో 55 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగయిందని అంతే స్థాయిలో 92.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ యాసంగిలో సేకరించామన్నారు, ఇందులో 62.82 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్.సి.ఐకు అందజేయడం కోసం మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఈ దశలో ఎఫ్.సి.ఐ. కేవలం 24.57 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ మాత్రమే తెలంగాణ నుండి తీసుకుంటామని అంటుందని అలా అయితే తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని పియూష్ గోయల్తో అన్నారు మంత్రి గంగుల. ఈ సమస్యను అధిగమించేందుకు ఈ యాసంగిలో ఎఫ్.సి.ఐకు 80 నుండి 90 శాతం పారాబాయిల్డ్ రైస్ ఇవ్వడానికి అనుమతించాలని గతంలోనే కేంద్రానికి లేఖను రాసామని దానిపై సానుకూల నిర్ణయం తీసుకొని కరోనా క్లిష్ట సమయంలో రైతులను ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.

ముఖ్యంగా ఫ్రిబవరి నుండి మే వరకూ తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని రారైస్ గా మిల్లింగ్ చేస్తే ధాన్యం విరిగిపోతుందని ఈ సమస్యను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరారు మంత్రి గంగుల. 2011-‌12 నుండి 2019‌-20 రబీ సీజన్లో పారాబాయిల్డ్ రైస్ ను 92.70 శాతం వరకూ తీసుకున్న విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తుంచేశారు, అదే విధంగా ఈ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ ని 12.82 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్రానికి విజ్ణప్తి చేశారు గంగుల. సీజన్ల వారీగా రబీలో కేంద్రం తీసుకున్న గణాంకాలతో సహా వివరించారు.

-గతంలో నష్టపోయిన 30 రోజుల మిల్లింగ్ సమయాన్ని కేంద్రం భర్తీ చేయాలి..
2019-‌20 సీజన్లో ఎఫ్.సి.ఐ వెరిఫికేషన్ కోసం మిల్లింగ్ని దాదాపు నెలరోజుల పాటు ఆపడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని కేంద్రమంత్రికి చెప్పారు గంగుల కమలాకర్. 300 కోట్ల విలువ గల లక్ష మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎప్.సి.ఐ గడువు ముగిసిందనే కారణంతో తీసుకోవడం లేదని, సహ్రుదయంతో గతంలో ఆగిన నెలరోజుల సమయాన్ని బియ్యం ఇవ్వడానికి ప్రస్థుతం కేటాయించాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ని కోరారు మంత్రి గంగుల కమలాకర్, కరోనా సంక్షోభంలోనూ రైతుల ప్రయోజనం దృష్ట్యా దేశం మొత్తం సేకరించిన 119 లక్షల మెట్రిక్ టన్నుల్లో కేవలం తెలంగాణే 54 శాతం 64.17 లక్షల మెట్రిక్ టన్నుల్ని అందజేసిందన్నారు మంత్రి గంగుల, ఇంత పెద్ద ఎత్తున సేకరించిన ధాన్యం మిల్లింగ్ అంతే వేగంగా చేసామని ఐతే ఎఫ్.సి.ఐ వెరిఫికేషన్ వల్ల నెలరోజుల మిల్లింగ్ సమయాన్నికోల్పోవడంతో ఇంకా లక్షటన్నుల బియ్యాన్ని ఎఫ్.సి.ఐ కు అందజేయాల్సి ఉందన్నారు, అందుకోసం గతంలో నష్టపోయిన నెల రోజుల గడువును ఇవ్వాల్సిందిగా కేంద్రానికి విజ్ణప్తి చేసారు. 2018-19 లో 37 లక్షల మెట్రిక్ టన్నులకే 2020 ఏప్రిల్ 30 వరకూ సీఎంఆర్ గడువు ఇచ్చిన ఎఫ్.సి.ఐ, 2019-20 లో 64.17 లక్షల మెట్రిక్ టన్నులకు కేవలం మార్చి 31 వరకే గడువు ఇచ్చారని ఇందులో సైతం 22 రోజులు ఎఫ్.సి.ఐ పాడి స్టాక్ ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ వల్ల మిల్లింగ్ నిలిచిపోయిందన్నారు. అందువల్ల మిల్లింగ్లో 30 రోజుల్ని కోల్పోయామని దీన్ని భర్తీ చేసి కోల్పోయిన 30 రోజుల్ని ఇవ్వాలనే విషయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని గంగుల కేంద్ర మంత్రి పియూష్ గోయల్ని కోరారు. అందువల్ల కరోనాలాంటి విపత్కర సంక్షేభ సమయంలో తెలంగాణలోని సన్న చిన్న కారు రైతులకు మరో 300 కోట్లు నష్టపోకుండా లక్ష మెట్రిక్ టన్నుల బాలెన్స్ బియ్యాన్ని అందజేయడానికి 30 రోజుల సమయం ఉపయోగపడుతుందన్నారు మంత్రి గంగుల.

-రాబోయే వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలి..
రాబోయే 2020‌-21 వానాకాలం (ఖరీఫ్) ధాన్యం సేకరణని 60 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచవల్సిందిగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్కు విజ్ఞప్తి చేసారు మంత్రి గంగుల. ఈ అంశంపై గతంలో ఇచ్చిన హామీ మేరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 80 లక్షల మెట్రిక్ టన్నులకు ఖరీఫ్ ధాన్యం సేకరణ పెంచవల్సిందిగా కోరారు, ప్రస్థుతం తెలంగాణలో వివిద రకాల ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సహించగా ఇంకా 55 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని తద్వారా 145 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాలున్నాయన్నారు, ఇంత పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని, తెలంగాణ రాష్ర్టంలోని చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని 2021-22 ఖరీఫ్ సీజన్లో రాష్ర్టంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతి ఇవ్వాల్సిందిగా మంత్రి గంగుల కేంద్రాన్ని కోరారు.

వీటితో పాటు నూతనంగా ధాన్యం సేకరణలో కేంద్రం నూతనంగా చేయాలనుకుంటున్న నిబందనల్ని ఉపసంహరించుకోవాలని మంత్రి పియూష్ గోయల్నికోరారు గంగుల, రైతును రాజుగా చేయడం కోసం ప్రభుత్వాలు పనిచేయాలని వారికి అండగా ఉండాల్సిన తరుణంలో తరుగు, తేమ శాతం, రంగుమారిన గింజలు, మట్టిపెళ్లలు వంటి ప్రమాణాల్ని మార్చాలనే ఆలోచనల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లారు గంగుల. రైతుల భాగు కోసం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న రైతుబందు, రైతు బీమా, ఇరవైనాలుగ్గంటల ఉచిత కరెంటు, సాగునీటి వనరుల్ని అందుబాటులోకి తేవడం వంటి చర్యలు దేశానికే ఆదర్శంగా మారాయని పియూష్ గోయల్కి వివరించిన గంగుల కేంద్రం నుండి సైతం అదేరీతిలో మద్దతును అందజేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

ఢిల్లీ భయల్దేరడానికి ముందు మంత్రి గంగుల సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి కేంద్ర మంత్రికి అందజేయాల్సిన రిపోర్టులను గణాంకాలతో సహా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పియూష్ గోయల్కి అందజేశారు. వాటన్నింటిని సావదానంగా తిలకించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యల్ని అర్థం చేసుకొని రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్.

- Advertisement -