కరోనా ప్రారంభంలో కొంత భయపడినా సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు మంత్రిఈటల రాజేందర్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఈటల… వైద్యరంగంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు.
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఒకప్పుడు కరువు కాటకాలు, వలసలతో తల్లడిల్లిందని పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని చెప్పారు. కరువు, వలసలతో బాధపడిన రాష్ట్రం నేడు దేశానికి ధాన్యాగారంగా మరిందని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషివల్లే రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని వెల్లడించారు.
సీఎంను అడిగి వెంటనే జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆరేండ్లలోనే మహబూబ్‌నగర్ జిల్లా చాలా అభివృద్ధి చెందింది. గతంలో ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జిల్లా కేంద్రంలోనే పెద్ద దవాఖానాను నిర్మించుకున్నామని చెప్పారు. కేటీఆర్ నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.