న్యాయబద్ధంగా రైతు బంధుకు అర్హత ఉండి రానట్లైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మండలం, మదనపూర్, అడ్డాకుల మండలాల్లోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసి తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాబోయే రోజుల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా వారి పరిధిలోని ఐదు వేల ఎకరాలకు సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని, రైతుల సమాచారంతో సేకరిస్తామని తెలిపారు. రైతులు ఎప్పటిలాగే సాధారణ పంటలు సాగు చేయకుండా వాణిజ్య పంటల పై దృష్టి సారించాలన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 55 లక్షల ఐదు వేల మంది రైతులకు రైతుబంధు డబ్బులు అందాయన్నారు. ఇంకా రైతుబంధు రావాల్సిన వారు నాలుగు లక్షల పైన ఉన్నారని….పేర్లు సరిగా లేకపోవడం, బ్యాంకు ఖాతాలు తెరవకపోవటం వంటి కారణాల వల్ల వీరికి రైతుబంధు జమ కాలేదని తెలిపారు.