మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ట్ స్టేషన్‌ని ప్రారంభించారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కొలేటి దామోదర్. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌తో కలిసి కోటి రూపాయల ఖర్చుతో నిర్మించిన స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోలేటి దామోదర్ మాట్లాడుతూ, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మాన్య ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ స్వరూప స్వభావాలే మారిపోయాయని రాష్ట్రంలో పోలీస్ శాఖ అత్యాధునికతను సంతరించుకుని అంతర్జాతీయ స్థాయిలో ముందుకుపోతున్న దని అన్నారు.
ముఖ్య మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మొట్టమొదటి అధికారిక సమావేశం డిజిపి మరియు ఇతర ఉన్న తాధికారులతో నిర్వహించారని ఆ సమావేశంలోనే పోలీస్ శాఖ లోటుపాట్లను, లొసుగులను తెలుసుకున్న కేసిఆర్ గారు పోలీస్ డిపార్ట్ మెంట్ కు రూ.500 కోట్లు మంజూరు చేసి, సరికొత్త ఇన్నోవా వాహనాలను సమకూర్చారని ఆ వాహనాలలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసి, నేరం జరిగిన చోటికి పోలీసులు సత్వరం చేరుకునే అవకాశాన్ని కల్పించారని అన్నారు.
రాష్ట్రమంతటా భారీగా సిసి కెమెరాలను ఏర్పాటు చేశారని నేర పరిశోధనకు ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలో వున్నన్ని సిసి కెమెరాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విషయం మనం గమనించాలని ఆయన అన్నారు.పోలీస్ స్టేషన్ల నిర్వాహణకు ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కు నగరంలో నెలకు 75 వేల రూపాయలను, జిల్లా కేంద్రాలల్లో 50 వేల రూపాయలను, మండలాల్లో 25 వేల రూపాయలను ఖర్చుల క్రింద ఇస్తున్నారని ఈ విధానం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు. మహిళల రక్షణ కోసం ‘షీ-టీమ్స్” ను ఏర్పాటు చేశారని సుమారు 28 వేల మందిని కొత్తగా పోలీస్ శాఖలో నియమించారని శాఖను బలోపేతం చేశారని ఆయన అన్నారు.
పోలీస్ స్టేషన్లంటే, పోలీసులంటే ప్రజలకున్న భయాలను పోగొట్టి పోలీసులను ప్రజలకు స్నేహితులుగా పనిచేసే విధంగా ‘సిటిజెన్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థని ఏర్పాటు చేశారని, ట్రాఫిక్ పోలీసులకు పొల్యూషన్ అలవెన్స్ క్రింద వేతనం పై 30 శాతం అదనపు జీతం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వ మని సెలవులు లేకుండా కుటుంబాలకు దూరంగా నిర్విరామంగా పనిచేస్తున్న పోలీసులకు వారానికి ఒకరోజు సెలవు మంజూరు చేశారని అన్నారు.హోంగార్డుల జీతాన్ని 9 వేల నుంచి 23 వేలకు పెంచడమే కాక రోజుకి 675 రూపాయల డ్యూటీ అలవెన్స్, 1,000 ఇంక్రిమెంట్ మంజూరు చేస్తున్నారని మరణించిన హోంగార్డుల కుటుంబాలకు సోషల్ సెక్యూరిటీ పథకం కింద రూ.5 లక్షలు అందజేస్తున్నారని అన్నారు.
పంజగుట్ట, గచ్చిబౌలి, ఆదిభట్ల పోలీస్ స్టేషన్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించారని పంజగుట్ట పోలీస్ స్టేషన్ ను ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఉన్నతాధికారులు సందర్శించి ఎంతగానో కొనియాడారని ఇదే స్థాయిలో రామగుండంలో పోలీస్ గెస్ట్ హౌస్ నిర్మాణం, గోదావరిఖనిలో పోలీస్ స్టేషన్ నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతున్నదని దామోదర్ అన్నారు.
రాష్ట్రమంతటా ఉన్న పోలీస్ స్టేషన్లు, ఇతర పోలీస్ భవనాలు ఎన్నో తరాల కిందట, ముఖ్యంగా నిజాం కాలంలో నిర్మించినవే ఎక్కువగా ఉన్నాయని అవి ఇప్పటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి ఏమాత్రం అనుకూలంగా లేవు సరికదా, చాలా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని పోలీస్ వ్యవస్థ పటిష్టతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఎంతైనా అవసరమని భావించిన కే.సి.ఆర్. గారు ఆధునిక హంగులతో పోలీస్ భవనాల నిర్మాణాన్ని యుద్ధప్రాదిపదికన చేపట్టాలని నిర్ణయించారని ఆయన అన్నారు.
హైదరాబాదు నగరంలో జూబిలీ హిల్స్ రోడ్ నెం. 12లో అత్యాధునిక హంగులతో 400 కోట్ల రూపాయల వ్యయంతో “ట్విన్ టవర్” పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరుగుతున్న దని 20 అంతస్తుల ఈ భవన నిర్మాణం త్వరలో పూర్తవుతుందని దీనితో రాష్ట్రంలో అన్ని ప్రదేశాల శాంతిభద్రతలను, బందోబస్తులు వంటి అన్ని కార్యకలాపాలను అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ఈ భవనం నుంచే పర్యవేక్షించే సదుపాయం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
పోలీస్ స్టేషన్లలో అత్యాధునిక హంగులు కల్పించే ప్రక్రియలో భాగంగా రిసెప్షన్ సెంటర్లు, ఫ్రంట్ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇందుకుగాను ప్రభుత్వం 26 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని అన్నారు.
అంతేకాక పోలీస్ స్టేషన్లలో సందర్శకులకు పార్కింగ్, స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా వేచి వుండే గదులు, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నదని కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలలో 13 జిల్లా పోలీస్ అధికారుల కార్యాలయాలకు (డిపిఓలు), 2 కమీషనరేట్లకు భవనాల నిర్మాణానికి ప్రభుత్వం 375 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు.
ఐఆర్ (ఇండియన్ రిజర్వు) బెటాలియన్ కు సంబంధించిన 9 భవనాలను ఆదిలాబాద్, ఖమ్మం మరియు రంగారెడ్డి జిల్లాలలో నిర్మించడానికి ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని పనులు జరుగుతున్నాయని అన్నారు.
కేవలం పోలీస్ డిపార్టుమెంటు పనులే కాక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అబ్కారి శాఖకు సంబంధించిన నిర్మాణాలను, పశువిశ్వవిద్యాలయానికి సంబంధించిన నిర్మాణాలను, అటవీ శాఖకు సంబంధించిన నిర్మాణాల కాంట్రాక్టును చేపట్టి, అనుకున్న సమయానికి వారికి పూర్తి చేసి ఇవ్వడం జరిగిందని కూడా ఆయన తెలియజేశారు.
అటవీశాఖకు సంబంధించి ములుగులో పరిపాలనా భవనం, ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యుట్, బాయ్స్ హాస్టల్ నిర్మాణాన్ని 50 కోట్ల రూపాయలతో చేపట్టి పూర్తి చేయడం జరిగిందని ఈ భవనానికి ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారని అన్నారు.కొత్తగా మైనారిటీ శాఖకు సంబంధించిన జే.పి దర్గా అభివృద్ధికి 50 కోట్ల రూపాయల పనులు, కోకాపేటలోని క్రిస్టియన్ భవన నిర్మాణానికి 10 కోట్ల రూపాయల పనుల కాంట్రాక్టులు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు వచ్చాయని తెలియజేస్తూ, 11 వేరువేరరు పథకాల క్రింద తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో 115 పోలీస్ స్టేషన్ల భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 237.12 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.
ఇందులో భాగంగానే ఇప్పుడు నస్పూర్ లో ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగిందని 07.02.2017 నాడు భవన నిర్మాణం మొదలై, పనులు 100 శాతం పూర్తయ్యాయని కోటి రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనం, క్రింది అంతస్తు 3,753 చదరపు అడుగులు కాగా మొదటి అంతస్తు 1,290 చదరపు అడుగులు. భవనం మొత్తం వైశాల్యం 5,043 చదరపు అడుగులని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎంఎన్ఏ శ్రీ నడిపెల్లి దివాకర్ రావు, రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ వి. సత్యనారాయణ, ఐపిఎస్ తదితరులు ప్రసంగించారు.