పవన్ తమ్ముడు @ 22

43
pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తమ్ముడు. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం అంటే 1999 లో విడుదలైన ఈ చిత్రం పవన్ కెరీర్‌లోనే ఓ సెన్సేషన్‌. అమీర్ ఖాన్ నటించిన జో జీతా వహీ సికందర్‌కు రీమేక్‌గా తెరకెక్కగా బాలీవుడ్‌లో సైక్లింగ్ అంశంతో చిత్రీకరించగా తెలుగులో బాక్సింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ సరసన ప్రీతి జింగానియా హీరోయిన్‌గా నటించగా బి. శివరామకృష్ణ శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించాడు. రమణ గోగుల ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా పవన్‌ని ఈ సినిమా యూత్‌కి మరింత దగ్గరయ్యేలా చేసింది. హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో 119 రోజులు ఆడి 80 లక్షలు వసూలు చేయగా విజయవాడ యువరాజ్ థియేటర్‌లో 176 రోజులు, వైజాగ్ సంగం థియేటర్‌లో 134 రోజులు ఆడి కోట్లాది రూపాయలు వసూలు చేసింది.

ఛాతీ పై బరువైన రాతి పలకను సమ్మెటతో పగులగొట్టించుకోవటం, నీటితో నింపిన కుండలని కాలితో బ్రద్దల కొట్టటం, కొబ్బరి కాయని చేతులతో పగులగొట్టటం, చేతి వ్రేళ్ళ పై కారు నడిపించుకోవటం వంటి స్టంట్ లను పవన్ రియల్‌గా చేయడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. సినిమా విడుదలై 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు పవన్‌కు విషెస్ చెబుతూ సినిమా పోస్టర్‌ని షేర్ చేస్తున్నారు.