చికిన చమ్మేళీ అంటూ బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ చేసిన డ్యాన్సు ఇప్పటికీ దమ్ములేపుతూనే ఉంది. తాజాగా మరోసారి తన డాన్సులతో రెచ్చిపోయి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. తాజాగా విడుదలైన ‘బార్ బార్ దేఖో’ సినిమాలోని ‘కాలాచష్మా’ పాటకు కత్రినాకైఫ్ ,సిద్దార్థ మల్హోత్రా కళ్లజోళ్లు పెట్టుకుని చేసిన డ్యాన్సులు ఇపుడు యూట్యూబ్‌లో సంచలనం రేపుతోంది. అయితే ఈ పాటకు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పాటను రాసింది ఓ హెడ్ కానిస్టేబుల్. పంజాబ్ పోలీసుశాఖలో పనిచేస్తున్న అమ్రిక్ సింగ్ షెరా (43) ఈ పాటను రచించారు.
1990లో తాను 15 ఏళ్ల వయసులో ఉన్నపుడు రాసిన ఈ పాటకు ఇంత క్రేజ్ వస్తుందని ఊహించనే లేదన్నారు అమ్రిక్ సింగ్. ‘రెండు నెలల కిందట నా స్నేహితులు ఫోన్‌చేసి నీ ‘కాలాచష్మా’ పాట చానెళ్లలో వస్తున్నదని చెప్పారు. నాకు ఆనందంతోపాటు షాక్ కలిగింది. నాకు తెలియకుండా ఇదంతా జరిగింది’ అని షెరా తెలిపారు. ఓ సిమెంట్ సంస్థ ప్రారంభోత్సవంలో ప్లే చేస్తామంటూ ముంబైకి చెందిన ఓ కంపెనీ తన పాట హక్కులను తీసుకున్నదని, అందుకు కేవలం రూ. 11వేలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. అయితే ఆ సిమెంట్ కంపెనీ పేరు తనకు తెలియదన్నారు.
సినిమాలో వాడుకుంటున్న విషయాన్ని తనకు చెప్పలేదన్నారు సింగ్.ఈ పాటను సినిమాలో వాడుకున్నందుకు తనకేం కోపం లేదన్నారు. ఈ సినిమా స్క్రీనింగ్ షోకు పోవాలనుకున్నానని.. అయితే ముంబై నుంచి తనకు ఎవరూ ఫోన్ చేయలేదన్నారు. అయితే పంజాబ్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి ఈ పాట రాశాడని అందరికీ తెలియజేయాలనుకున్నాని షెరా ఆవేదన వ్యక్తం చేశారు.
తాను తొమ్మిదో తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు రాసిన తన పాటలను రికార్డు చేయాల్సిందిగా అప్పట్లో చాలామంది గాయకులను కలిశానని, కానీ ఎవరూ సహకరించలేదని షెరా అవేదన వ్యక్తం చేశారు. అయితే చాలాకాలం తర్వాత ఇంగ్లండ్‌లోని ఓ వేడుకలో గాయకుడు అమర్ అర్షి ‘కాలాచష్మా’ పాట పాడటంతో అది సూపర్ హిట్ అయిందని, దీంతో ఓ కంపెనీ ఈ పాటను రికార్డుచేసి మొదట ఇంగ్లండ్‌లో విడుదల చేసిందని, ఆ తర్వాత పంజాబ్‌లోనూ ఈ పాట మార్మోగిందని చెప్పారు. ఇప్పటికైనా తన పాటకు గుర్తింపు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశాడు కానిస్టేబుల్ సింగ్.