పెద్దలు జానారెడ్డి మనోడే…

661
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పుడు జానారెడ్డి చాలా ప్రియమైన నాయకుడు అయిపోయారు. జానా కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ఫ్లోర్ లీడరు. పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు. ఉమ్మడిరాష్ట్రంలో ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసింది కూడా ఆయనే.దీంతో జానా సమర్థతను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం…ఆయనను కాంగ్రెస్‌ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకుంది. దీంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం ఏ చిన్న అవకాశం దొరికినా ఉతికి ఆరేయాల్సిన జానా….ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తు..అధికార టీఆర్ఎస్‌కు వరంలా మారాడు.  పరోక్షంగా జానారెడ్డి, అధికార పార్టీకి సహకరిస్తున్నారని బాహాటంగానే కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్న విషయం విదితమే.

ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార పార్టీపై చేసిన ఆరోపణలపై జానానే స్వయంగా కౌంటరిస్తారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి…టీఆర్ఎస్‌పై విమర్శలు చేసిన ప్రతిసారీ జానా….సొంతపార్టీ నేతలు చేసిన ఆరోపణలను ఖండిస్తారు. జానా ఇలా ఎందుకు మాట్లాడుతారోనన్న విషయం ఎవరికి అంతుపట్టడం లేదు. ఇటీవలె కాంగ్రెస్‌ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి…అధికార పార్టీని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేయగా….జానా మాత్రం ఇందుకు భిన్నంగా తన స్వరం వినిపించారు. ఒప్పందంతో చెలరేగిన విమర్శల సుడిగుండం నుంచి బయటపడే యత్నం చేస్తున్నారు.

తమ్మిడిహట్టి వద్ద 152 అడుగుల ఎత్తుతో బ్యారేజ్ కట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే టీఆర్ఎస్ 149కే ఒప్పందం చేసుకుని ద్రోహం చేసిందనేది జానా చేసిన ఆరోపణ. అప్పట్లో తాము ఒప్పందం కూడా చేసుకున్నామంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే జానారెడ్డి తన ప్రెస్ మీట్ లో అప్పట్లో జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాలేదని.. ఇప్పుడు ప్రభుత్వం తాము చేసిన ప్రయత్నం ప్రకారం 152 అడుగుల ఒప్పందం చేసుకోకుండా మోసం చేసిందని ఆరోపించారు. వాస్తవానికి తెరాసను తప్పు పట్టాలని అనుకున్న జానారెడ్డి తనకు తెలియకుండానే టీఆర్ఎస్ నేతలకు మంచి అస్త్రం అందించారు.

అసలు తమ్మిడిహట్టిపై కాంగ్రెస్ ఒప్పందం చేసుకోలేదని జానారెడ్డి నిర్ధారించడంతో కాంగ్రెస్ నేతలు ఇరకాటంలో పడ్డారు. ఇక ప్రాజెక్టులపై టీఆర్ఎస్ ఇచ్చిన పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు దీటుగా కాంగ్రెస్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తుస్సు మనగా ఈ కార్యక్రమానికి జానా హాజరుకాలేదు. ప్రాజెక్టుల రీడిజైన్ సరైందేనని…దీనిపై చర్చ అవసరం లేదని భావించిన జానా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని సన్నిహిత వర్గాల సమాచారం.

ప్రతిపక్ష నేతగా ఉంటూ అధికార పార్టీకి లాభం చేకూర్చేలా వ్యవహరించిన జానారెడ్డే స్టార్ క్యాంపెయినర్ అని అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు ముందుకు కాంగ్రెస్ శాసనసభా పక్ష కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న రూ. 5 భోజన పథకం బాగుందని జానారెడ్డి ప్రశంసించడమే దీనికి కారణం. అసలు ప్రత్యేకంగా జీహెచ్‌ఎంసీ భోజన కేంద్రం నుంచి పార్సిల్ తెప్పించడమే కాదు, దానిని తింటూ ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చి, ఆ భోజనం బాగుందని కూడా జానారెడ్డి కితాబిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నేతే స్వయంగా ప్రభుత్వ పథకం బాగుంది అని చెప్పడం కాంగ్ నేతలకు ఏ మాత్రం మింగుడు పడలేదు.

Janareddy

ఇక ఇటీవలె యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జానా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, సాగర్ కింద రెండో పంటకు నీరు అందిస్తామన్న హామీలను నెరవేరిస్తే టీఆర్ఎస్కు ప్రచార సాధకుడిగా పని చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కృష్ణా పుష్కరాలలో పుష్కరస్నానం చేసిన జానా…ఏర్పాట్లను అభినందించారు.

ఇలా అధికార పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ వ్యూహలు సిద్ధం చేసిన ప్రతిసారీ జానా…టీఆర్ఎస్‌కు వరంలా మారుతున్నాడు. దీంతో జానా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న మనోడేనన్న భావనలో గులాబీ నేతలు ఉన్నారట.

అందుకే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జానారెడ్డిని ఎప్పుడు సంబోందించిన పెద్దలు జానారెడ్డి అంటూ గౌరవంగా,మర్యాదపూర్వకంగా పిలుస్తారు.

Janareddy krishna pushkaralu

- Advertisement -